క్రిబ్కో (క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్) నూతన ఛైర్మన్‌గా తెలుగు వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు. మొన్నటివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న సుధాకర్ చౌదరి.. సోమవారం జరిగిన క్రిబ్కో ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలానే డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ రెండు అత్యున్నత పదవులకు ఒకే నామినేషన్లు దాఖలు కావడంతో.. ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నూతన ఛైర్మన్ సుధాకర్ చౌదరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎరువులు, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడంలో సుధాకర్ చౌదరి, చంద్రపాల్ సింగ్ యాదవ్ విస్తృత అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఎస్‌సీయూఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం గమనార్హం. బోర్డు సభ్యులు, ఇద్దరు మంత్రుల మధ్య చర్చల తర్వాత నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్, ఉత్తరప్రదేశ్ సహకార మంత్రి జెపిఎస్ రాథోడ్ రెండు నామినేషన్లకు ఆమోదం తెలిపారు. వైస్ చైర్మన్ పదవికి గుజరాత్‌కు చెందిన మగన్‌భాయ్ పటేల్, బిపిన్ పటేల్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే బిపిన్ చివరికి చంద్రపాల్ యాదవ్‌ను సిఫార్సు చేశారు. దాంతో వైస్ చైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం అయింది.
Also Read: OnePlus 15: ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీ.. ‘వన్‌ప్లస్ 15’ ఫీచర్స్ లీక్! సూపర్ డిజైన్, బిగ్ బ్యాటరీ
వల్లభనేని సుధాకర్ చౌదరి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. విజయవాడలోని ఎస్‌ఎస్ఎం పబ్లిక్ స్కూల్‌లో (1978–1986) పాఠశాల విద్యను పూర్తి చేశారు. బాబుజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ (1989–1993) నుంచి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఆయన నాయకత్వంలో మోహన్ స్పింటెక్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన వస్త్ర తయారీ కంపెనీగా ఎదిగింది. వస్త్ర పరిశ్రమ, సహకార రంగాలలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. సుధాకర్ చౌదరి ఫిబ్రవరి 2020 నుంచి క్రిబ్కోలో డైరెక్టర్‌గా ఉన్నారు. క్రిబ్కో ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఆడిట్ కమిటీ సభ్యుడు కూడా. క్రిబ్కో ఏప్రిల్ 1980లో స్థాపించబడిన రసాయన ఎరువుల ఉత్పత్తి సంస్థ.