Vadde Sobhanadreeswara Rao: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు తేలిగ్గా లాక్కోవాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆరోపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడా అమలు చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వీరభక్త హనుమాన్ అయిన వైఎస్ జగన్ మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు అంటున్నారని.. కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోదీది తప్పు అని మాత్రం చంద్రబాబు అనడం లేదని విమర్శించారు. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక మీడియా సమావేశం నిర్వహించారు.
Read Also: Prashanth Varma : హనుమాన్ కోసం అదే రిఫరెన్స్ గా తీసుకున్నా..
వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. బీజేపీకి పొత్తు, తొత్తుగా ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. తనకు కావాల్సిన కార్పొరేట్ల కోసం ప్రధాని మోడీ పరిపాలన జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే 15 పోర్ట్ లు, 6 విమానశ్రయాలు అదానికి కట్టబెట్టారని, అలాగే ప్రధాని మోడీ.. 14 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు రద్దు చేశారని విమర్శించారు. రైతుల రుణాల రద్దు చేయమంటే మోడీకి మనసు రాలేదని అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.. నరేంద్ర మోడీ పరిపాలన చూశాక కాంగ్రెస్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు.