కాంగ్రెస్ పార్టీ పేదలకు దానం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి భూమిని లాక్కుంటుందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల సమస్యలను తెలుసుకున్నాడని అన్నారు. బీజేపీ పార్టీ దళితులను అనగదొక్కాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులల వారీగా రిజర్వేషన్లు చేస్తామని హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు దేశవ్యాప్తంగా 85 శాతం మంది ఉన్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు కల్పించిన తర్వాత మాత్రమే రాజకీయ చైతన్యం మొదలైందని ఆయన వెల్లడించారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 54 శాతం బీసీలుంటే వారిని సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకే పరి మితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను బీజేపీ దేవుడంటోందని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాష్ట్రంలో ప్రజలంతా మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. కేంద్రానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో.. మాట్లాడుతారో వాళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, బీసీలందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సహకరించాలన్నారు.
Also Read : Kottu Satyanarayana: చంద్రబాబు అనే శని పవన్ నెత్తిమీద ఉంది.. అందుకే అలా..!
