ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్ బుకింగ్‌లో డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్ ఇన్సెంటివ్ కూపన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్ కూపన్ పొందాలంటే ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్ చేసుకునేవారికే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. పర్యాటక ప్రాంతాల్లోని ఏ హోటల్‌లో గది బుక్ చేసుకున్నా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే బుకింగ్ ధరలో రూ. 1000 లేదా 25శాతం ఏది తక్కువ ఉంటే దాన్నే ప్రభుత్వం చెల్లిస్తుంది. చార్‌ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులు కూడా ఈ కూపన్ పొందొచ్చట. ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగం పునురుద్ధరణలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి సత్పాల్ మహారాజ్ వెల్లడించారు.