Breaking News: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లును సభ ఆమోదించింది. దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఉత్తరాఖండ్ తర్వాత ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా యూసీసీ బిల్లును తీసుకువచ్చేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాలు యూసీసీకి సిద్ధమయ్యాయి.
Read Also: Anand Mahindra: “12th ఫెయిల్” ఐపీఎస్ జంట ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆనంద్ మహీంద్రా..
‘‘ఉత్తరాఖండ్‌కి ఇది ముఖ్యమైన రోజు. దేశవ్యాప్తంగా ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ బిల్లును మేం ఆమోదించాం. యూసీసీని ఆమోదించిన తొలిరాష్ట్రంగా నిలిచింది. ఉత్తరాఖండ్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నా, మేము అధికారంలోకి రావడానికి, బిల్లును ఆమోదించడానికి మాకు అవకాశం ఇచ్చారు’’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తుందని ధామి అన్నారు. మతంతో సంబంధం లేకుండా వివాహం, వారసత్వం, విడాకులు వంటి పలు విషయాల్లో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపితే.. స్వాతంత్ర్యం అనంతరం ఉమ్మడి పౌరస్మృతికి ఆమోదం తెలిపిన తొలిరాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.