Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పుట్టినప్పటి నుంచి నడుము కింద భాగంలో తోకలాంటిది పెరుగుతూ, తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న ఏడాదిన్నర చిన్నారిని చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎక్కడా పరిష్కారం దొరకలేదు. చివరకు బలరాంపూర్ వైద్యులు ముందుకు వచ్చి ఆ చిన్నారి జీవితం మారేలా చేశారు. లక్నోకు సమీపంలోని టిక్కా రావా చౌరాహా గ్రామానికి చెందిన సుశీల్ కుమార్, ఆర్తీ దేవీల కుమారుడికి పుట్టుకతోనే వెన్నెముక భాగం వద్ద ఒక చిన్న తోక ఏర్పడింది. ఆ తోక నెలలు గడిచేకొద్దీ పొడవు పెరిగింది. కదిలినా, ఏదైనా తగిలినా చిన్నారికి తీవ్రమైన నొప్పి కలిగేది. దీంతో కుటుంబం అనేక చోట్ల తిరిగినా వైద్యులు శస్త్రచికిత్సకు ముందుకు రాలేదు.
READ MORE: Pakistan: పాకిస్థాన్‌లోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు.. 15 మంది మృతి
చివరకు బలరాంపూర్ ఆసుపత్రిని ఆశ్రయించగా, సీనియర్ సర్జన్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ చిన్నారిని పరిశీలించి శస్త్రచికిత్స చేయడానికి అంగీకరించారు. ముందుగా ఎంఆర్ఐ, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, రక్తపరీక్షలు చేయగా అన్నీ సాధారణంగా రావడంతో నవంబర్ 14న ఆపరేషన్ చేపట్టారు. అయితే తోక వెన్నెముక ఎముకలను కప్పే స్పైనల్ కార్డ్ మెంబ్రేన్‌కి బలంగా అతుక్కుపోయినట్లు గుర్తించారు. క్షుణ్ణమైన ప్రణాళికతో, అత్యంత జాగ్రత్తగా ఆ తోకను తొలగించి చిన్నారిని ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అతని రెండు కాళ్లు సహజంగా పనిచేస్తున్నాయని, మూత్ర-విసర్జన నియంత్రణ వ్యవస్థ కూడా సవ్యంగానే ఉందని చెప్పారు. పిల్లవాడు పాలు, మృదువైన ఆహారం సాధారణంగా తీసుకుంటున్నాడు.