ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ఇటీవల కర్నూలులో జరిగిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో చెప్పిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా, నవంబర్ 27న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంలో వేలాదిగా వచ్చిన అభిమానుల మధ్య రామ్ చేసిన ఎమోషనల్ స్పీచ్ అందరికీ గూస్‌బంప్స్ తెప్పించేలా నిలిచింది.
Also Read : NTR–Neel: డ్రాగన్ షూటింగ్ రేస్‌లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్
రామ్ మొదటగా ట్రైలర్ ఎలా ఉందని అభిమానులను అడిగుతూ వేదికపై ఎనర్జీ పెంచాడు. అనంతరం మాట్లాడుతూ, “మాస్ సినిమాలు చాలానే చేశా. కానీ ఈ సినిమాలో ఫీలయిన ఎమోషన్ నాకు ఏ సినిమా ఇవ్వలేదు. ఫ్యాన్ హృదయం ఎలా ఉంటుంది? హీరోను ఒక ఫ్యాన్ ఎలా ప్రేమిస్తాడు? అదే ఈ సినిమా కాన్సెప్ట్” అని చెప్పాడు. అభిమానులను ఉద్దేశించి “నువ్వు ఉన్నావని నాకు తెలియకపోవచ్చు.. కానీ నేను ఉన్నానంటే కారణం నువ్వే!” అనే డైలాగ్ వేదికను ఎమోషనల్ గా మార్చింది. “ఈ సినిమా నా కెరీర్‌లో అత్యంత వ్యక్తిగత చిత్రం” అని రామ్ ప్రత్యేకంగా పేర్కొన్నాడు.
డైరెక్టర్ మహేష్ బాబు పి గురించి మాట్లాడుతూ, “ఏళ్లుగా నా మనసులో దాచుకున్న భావోద్వేగం ఈ సినిమాలో ఉంది. దాన్ని మహేష్ గారు ఇంకా అందంగా చూపించారు” అని రామ్ ప్రశంసించాడు. మైత్రి మూవీ మేకర్స్ గురించి “మైత్రి రవి గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. మా సినిమా భారాన్ని ప్రేమతో మోశారు” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి మాట్లాడుతూ, “అందం–నటన కలిపి కనిపించే అరుదైన కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత కనిపించింది” అని రామ్ చెప్పాడు. సంగీత దర్శకులు వివేక్–మెర్విన్ గురించి కూడా, “తెలుగులో కొత్త సౌండ్ కావాలనిపించి వారిని తీసుకున్నాం. మీరు వింటున్న మంచి పాటలు వారి కష్ట ఫలితం” అని ప్రశంసించాడు. అలాగే ఉపేంద్ర తో ఉన్న ప్రత్యేక బాండ్ గురించి కూడా చెప్పాడు “ఈ సినిమాలో ఆయనతో నాకు అద్భుతమైన కనెక్షన్ ఏర్పడింది” అని వెల్లడించాడు.
చివరగా, కర్నూల్ లో ఇటీవల జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, “ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దయచేసి ఎవ్వరూ తాగి డ్రైవ్ చేయకండి” అని రామ్ విజ్ఞప్తి చేశాడు. స్పీచ్ చివర్లో మరలా అభిమానులను ఉద్దేశించి, “మై డియర్ ఫ్యాన్ నువ్వున్నావని నాకు తెలియకపోయినా, నేను ఉన్నానంటే కారణం నువ్వే. 27న థియేటర్‌లో కలుద్దాం!” అని చెబుతూ ఈవెంట్ ఉత్సాహాన్ని పీక్‌కి తీసుకెళ్లాడు.