Winter storm hits US Northeast: అమెరికాలోని ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌ను తీవ్ర మంచు తుపాను తాకింది. మంగళవారం ఉదయం నుంచే ఈశాన్య ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దాంతో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. శీతాకాలపు మంచు తుఫాను కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 1200 విమానాలు రద్దయాయి. కొన్ని చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. మరోవైపు పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా సహా పలు ప్రాంతాల్లో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు.
పెన్సిల్వేనియా నుంచి మస్సాచుసెట్స్ వరకు ఉన్న పట్టణాల్లో మంగళవారం ఉదయం నుంచే మంచు పడడంతో దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా పెన్సిల్వేనియాలో ఓ స్నో మొబైలర్ ప్రాణాలు కోల్పోయాడు. కనెక్టికట్‌లోని ఫర్మింగ్టన్ పట్టణంలో దాదాపు 15.5 అంగుళాల మంచు కురిసింది. గత రెండేళ్లలో ఇలాంటి మంచు తుపాన్‌ను చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. సుమారు 10-20 సెంటీమీటర్ల మంచు, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందట.
Also Read: Rohit Sharma: ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!
భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో వాహనాలు రోడ్లపై ప్రయాణించడాన్ని నిషేధించారు. తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే.. మాస్ ట్రాన్సిట్‌ని ఉపయోగించాలని అధికారులు సూచించారు. న్యూయార్క్, బోస్టన్‌లలో దాదాపు 1200 విమానాలు రద్దు కాగా.. 2700 విమాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూయార్క్ నగరంలో 2.5 అంగుళాల హిమపాతం నమోదైంది. ఉత్తర న్యూయార్క్ నగర శివారు ప్రాంతాలు మరియు కనెక్టికట్, రోడ్ ఐలాండ్ సహా ఆగ్నేయ మసాచుసెట్స్‌లో అదనపు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది.