అమెరికా-ఇరాన్ యుద్దం పతాకస్థాయికి చేరుకుంటోంది. టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. హర్ముజ్‌పై ట్రంప్ డెడ్‌లైన్ విధిస్తే….తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు 45 రోజుల పాటు యుద్ధానికి విరామంపై పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే…రెండు దేశాలతో చర్చలతో జరుపుతున్నాయి. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు… పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డెడ్‌లైన్ మీద డెడ్‌లైన్లు విధిస్తున్నారు. చర్చలకు రావాలంటూ ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ట్రంప్ వార్నింగ్‌లకు…టెహ్రాన్ తలొగ్గుతుందా ? అమెరికాతో శాంతి చర్చలకు ముందుకొస్తుందా ? పశ్చిమాసియాలో యుద్ధానికి బ్రేకులు పడుతాయా ?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఒకవైపు యుద్ధానికి బ్రేకులు అని ప్రకటిస్తాడు…మరోవైపు బాంబుల వర్షం కురిపిస్తాడు. ఇరాన్‌లోని మౌళిక వసతులను నాశనం చేస్తూనే ఉన్నాడు. యుద్ధాన్ని ముగించాలంటే… చర్చలకు రావాలంటూ…ఇరాన్‌కు గడువు విధించాడు. ఒక గడువు ముగిసింది. ఇరాన్ తగ్గకపోవడంతో…మరోసారి డెడ్‌లైన్ పొడిగించాడు. అదే సమయంలో శాంతి ప్రతిపాదనలతో ముందుకొచ్చాడు. ట్రంప్ బెదిరింపులకు టెహ్రాన్ భయపడటం లేదు. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామని…చర్చలకు వచ్చేది లేదని హెచ్చరిస్తోంది. అమెరికా షరతులకు తలొగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. అమెరికా ధీటుగా బదులిస్తూనే ఉంటామని వార్నింగ్ ఇస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మళ్లీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇష్టమొచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్‌కు భీకర హెచ్చరికలు చేశారు. తాను నిర్దేశించిన గడువులోపు హర్మూజ్ జలసంధిని నౌకల రాకపోకలకు వీలుగా తెరవకపోతే ఇరాన్‌లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాల్లేకుండా చేస్తామని, నరకం చూపిస్తామని హుంకరించారు. మంగళవారం పవర్‌ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుందంటూ గాండ్రించారు. ఇరాన్‌లో వాటన్నింటినీ ఒక్కదెబ్బతో కొట్టిపడేస్తామని… పిచ్చి మూర్ఖుల్లారా…జలసంధిని తెరవండి.. లేదంటే నరకాన్ని చూస్తారు. అల్లాయే మీకు దిక్కు అంటూ ట్రూత్‌సోషల్‌లో హెచ్చరించారు. శత్రు భూభాగంలో గల్లంతైన తమ ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమాన పైలట్‌ను కాపాడామని ట్రంప్ ప్రకటించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయినా ఆ కర్నల్ సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. పైలట్ కోసం అన్వేషిస్తూ వచ్చిన అమెరికా వైమానికదళ విమానాలను ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో కూల్చివేసినట్లు ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇతర విమానాల్లో ఇంధనం నింపేందుకు ఇది వచ్చినట్లు తెలిపింది. ఇందులోని సిబ్బందికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. దీనిపై అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు త్వరలోనే పెద్ద షాక్ ఇవ్వనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ బెదిరించడంపై మండిపడింది. అమెరికాకు చెందిన సరకు రవాణా విమానాన్ని, రెండు హెలికాప్టర్లను ఇరాన్ కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. తమ పౌర ఆవాసాలపై దాడులు చేస్తున్నకొద్దీ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఐఆర్‌జీసీ… తమ దేశ పౌరులపై కాల్పులు జరుపుతోందని ఆరోపించింది. తాము ఉగ్రవాదుల నాయకులను ఏరిపారేస్తున్నామని…ఇరాన్ నాయకులకు ఒక్కొక్కరిగా వేటాడుతున్నామని స్పష్టం చేసింది. తద్వారా ఇరాన్‌లో ఉగ్రవాద పాలన క్షీణిస్తుంది. అలాగే అక్కడి సర్కార్ కుప్పకూలిపోతుంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, ఇజ్రాయెల్‌పై కాల్పులు జరిపే ఇరాన్ సామర్థ్యాలను కూడా నిర్వీర్యం చేస్తామని హెచ్చరించింది.
తాజా పరిణామాలు ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరతలోకి నెట్టాయి. ఇరాన్‌లోని 12 నగరాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిపాయి. బహ్రెస్థాన్‌లోని ఓ నివాస భవనంపై వైమానిక దాడులు చేసింది. అటు కోహ్గిలుయెహ్ ప్రాంతంలోని బ్లాక్ మౌంటెన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడి చేశాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు విడిచారు. మరోవైపు టెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న ఖోమ్‌లోని ఒక నివాస ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు మరణించారు. అలాగే టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పైనా దాడులు జరిగాయి. అయితే ఈ దాడులకు తాము చేశామని ఇజ్రాయెల్ గానీ, అమెరికా గానీ ప్రకటించలేదు. దక్షిణ ఇరాన్‌లో జరిగిన వైమానిక దాడిలో రెడ్ క్రెసెంట్ సహాయక వాహనం ధ్వంసమైందని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ వెల్లడించింది.
ట్రూత్‌లో చేసిన పోస్టులో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రాకపోయినా…లేదంటే హర్మూజ్ జలసంధిని తెరవకపోయినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌లో విద్యుత్ కేంద్రాలు, వంతెనలు లక్ష్యంగా మారతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇలా డెడ్‌లైన్ పెట్టడం…ఇదేం మొదటిసారి కాదు. గత నెల చివర్లోనే ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చారు. ఆ తరువాత ఆ గడువును పలుమార్లు పొడిగించారు. తాజాగా మళ్లీ గడువు పెంచడం ద్వారా చర్చలకు ఇంకా అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒప్పందం కుదరకపోతే అక్కడ ఉన్నదంతా ధ్వంసం చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు…యుద్ధ మేఘాలను మరింత పెంచుతోంది. అదే సమయంలో చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం సాధ్యమేనని కూడా సూచించారు.
మరోవైపు ఇరాక్‌లో అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరగడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఇరాన్ మద్దతుతో ఉన్న మిలీషియా గ్రూపులు అమెరికా లక్ష్యాలపై దాడులు చేస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ఇరాక్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల బగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ, ఎర్బిల్‌లోని కాన్సులేట్‌పై పలుమార్లు దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇరాన్ మద్దతు గల ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ ఇటీవల డ్రోన్లు, క్షిపణులతో అమెరికా స్థావరాలపై దాడులు జరిపినట్లు సమాచారం.
ఐదు వారాలు గడిచినా యుద్ధ ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ గట్టిగా బదిలిస్తూనే వస్తోంది. 48 గంటల్లోగా హర్మూజ్‌ను తెరవాలని లేదంటే నరకం చూపిస్తామని ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అయితే ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించింది. మరోవైపు కాల్పుల విరమణకు మూడు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పుడు ఆరు వారాలు దాటాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ వరుసగా దాడులు చేస్తోంది. ఇరు పక్షాల చర్యలతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్, అమెరికాతో…45 రోజులపాటు కాల్పుల విరమణకు పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు చర్చలు జరుపుతున్నాయి. అయితే రాబోయే 48 గంటల్లో ఈ ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యుద్ధం తీవ్రతరం కాకుండా నిరోధించడానికి…ఇదే చివరి ప్రయత్నమని మధ్యవర్తిత్వ దేశాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే వంటి మధ్యవర్తిత్వ దేశాలకు చెందిన ప్రతినిధులు, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చర్చలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
మధ్యవర్తులు రెండు దశల కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ ఉంటుందని, ఆ సమయంలో యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం చర్చలు జరుపుతారని చెప్పింది. రెండో దశలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం ఉంటుందని తెలిపింది. ఈ తుది ఒప్పందం సమయంలో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియంను తొలగించడం వంటివి ఉంటాయని వివరించింది. కేవలం 45 రోజుల కాల్పుల విరమణ కోసం హర్మూజ్‌ను తెరవడం, యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించదని అంతర్జాతీయ మీడియా తెలిపింది. హర్మూజ్ జలసంధిని తెరవడంపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని మంగళవారంలోగా తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు జరుపుతామని హెచ్చరించారు. హర్మూజ్‌ను తెరవకపోతే ఇరాన్ నాయకులు నరకంలో బతుకుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల క్రితం కూడా ట్రంప్ ఇరాన్‌కు ఇలాంటి వార్నింగే ఇచ్చారు. కానీ ఇరాన్‌తో చర్చలలో సానుకూల సంకేతాలు ఉన్నాయంటూ…హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి గడువును రెండుసార్లు పొడిగించారు.
మంగళవారంలోగా హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ వాడిన అసభ్య పదజాలంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి మనిషి ఉపయోగించే భాష అనేది అతని వ్యక్తిత్వానికి, మానవత్వానికి, నైతికతకు ప్రతిబింబమని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారంటే…అది వారి వ్యక్తిత్వ స్వభావంలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని… ఎందుకంటే ఈ యుద్ధ ప్రభావం ఎంతో మంది ప్రజలపై పడుతోందని తెలిపింది. చమురు ధరలు పెరిగాయి. రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని.. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు. ఇది సమస్త మానవాళికి, యావత్ ప్రపంచానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం స్పష్టం చేసింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో కొత్త నావిగేషన్ విధానాన్ని ఏర్పాటు చేసే ప్రోటోకాల్ ముసాయిదా తయారీ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఇది సిద్ధమైన తర్వాత మేము ఒమన్‌తో చర్చలు జరిపేందుకు ఇరాన్ రెడీ అవుతోంది. దీని ద్వారా ఉమ్మడి ప్రోటోకాల్‌ను రూపొందించాలని ఇరాన్ నిర్ణయించింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని నియంత్రించడమే ఈ ప్రతిపాదిత ప్రోటోకాల్ ఉద్దేశమని తెలుస్తోంది.
యుద్ధం తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరవడంపై ఒమన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చర్చలు ప్రారంభించాయి. ఒమన్, ఇరాన్‌ల ఉప విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు దేశాల నుంచి నిపుణులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా రవాణా సజావుగా సాగేలా చూసేందుకు సాధ్యమైన మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో ఇరు దేశాల నిపుణులు పశ్చిమాసియా ప్రాంతంలో స్థిరత్వాన్ని, నిరంతరాయ సముద్ర రవాణాను కొనసాగించే లక్ష్యంతో పలు ప్రతిపాదనలను సమర్పించారు. హర్మూజ్ జలసంధి కోలుకోలేని మార్పులకు లోనైందని ఇరాన్ నేవీ తెలిపింది. తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్‌ల కోసం దాన్ని తెరవబోమని ప్రకటించింది. ఇటీవలి జరిగిన ప్రాంతీయ పరిణామాలు ఒక కొత్త వాస్తవికతను తమకు తెలియజేశాయని పేర్కొంది. వాషింగ్టన్ నేతృత్వంలోని ప్రాంతేతర శక్తులు ఇకపై ఇరాన్ సమీప సముద్ర వాతావరణంలో షరతులను నిర్దేశించలేవు, అనియంత్రిత ప్రభావాన్ని చూపలేవని స్పష్టం చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మరింత పెంచాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్‌లో 200కు పైగా మౌలిక సదుపాయాలపై దాడులు జరిపినట్లు ప్రకటించాయి. అలాగే లెబనాన్‌లో హెజ్బొల్లాకు చెందిన 140కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపాయి. ఈ దాడుల్లో ఇరాన్ విప్లవ గార్డుల ఆయుధ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి తయారీ కేంద్రాలు లక్ష్యాలుగా మారాయి. విమానాలపై దాడులకు ఉపయోగించే బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. లెబనాన్‌లో హెజ్బొల్లా శిక్షణ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హెజ్బొల్లా రద్వాన్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇటీవల ఒక్కరోజులోనే 70కు పైగా దాడులు నిర్వహించినట్లు IDF తెలిపింది. ఈ దాడులు ప్రధానంగా క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ల తయారీ స్థావరాలపై జరిగాయి. ఇజ్రాయెల్ పౌరుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
మరోవైపు ఇరాన్ సైన్యం యూఏఈ, కువైట్‌లలో ఉన్న అమెరికా స్థావరాలపై కూడా డ్రోన్ దాడులు జరిపింది. అరాష్-2 డ్రోన్లను ఉపయోగించి రాడార్ వ్యవస్థలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. యూఏఈలోని అల్యూమినియం పరిశ్రమలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ పరిశ్రమలు సైనిక సామగ్రి తయారీలో కీలకమని ఇరాన్ ఆరోపిస్తోంది. షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్‌లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
బహ్రెయిన్‌లో చమురు నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయి. యూఏఈలోనూ పెట్రో రసాయనాల సముదాయాలపై దాడుల అనంతరం అగ్నికీలలు ఎగిశాయి. ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఓ భవంతి పూర్తిగా ధ్వంసమైంది. యుద్ధం వల్ల ఆహార, ఔషధ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగి లక్షలమంది ఇబ్బందులు పడుతున్నారని వివిధ సహాయక బృందాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. జూన్ వరకు యుద్ధం కొనసాగితే 45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆకలిదప్పుల బారిన పడతారని, 3.20 కోట్ల మంది అర్ధాకలితో అలమటిస్తారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
యుద్ధంలో అమెరికాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా…మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పైకి టెహ్రాన్‌పై ఆధిపత్యం సాధించామని చెబుతున్నా…ఇరాన్ మాత్రం అంత సీన్ లేదంటోంది. యుద్ధం వేళ…రక్షణ రంగానికి అమెరికా భారీగా నిధులు పెంచింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థపై ఇరాన్ అణు శక్తి సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో అమెరికా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు యుద్ధవిమానాలు కూలిపోయిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గత 20 ఏళ్లలో శత్రు దేశం దాడిలో అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడం ఇదే తొలిసారి. ఇరాన్‌పై పూర్తి ఆధిపత్యం సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఘటనలు చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆరు వారాలుగా అమెరికా భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తున్నప్పటికీ ఇరాన్ ప్రతిఘటనలు అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధవిమానం కూలిపోయినప్పటికీ, ఇరాన్‌తో జరుగాల్సిన దౌత్యపరమైన చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది వరకు ఈ ఘటనపై అధికారికంగా స్పందించని ట్రంప్, మొదటిసారి స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పుడు పూర్తిస్థాయి సైనిక వ్యవస్థ కలిగిన దేశంతో యుద్ధం చేస్తోంది. దీనివల్ల గగనతల భద్రతపై ప్రభావం పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ దాడుల్లో కీలక పాత్ర పోషించినది రాడార్‌కు చిక్కని ఇన్‌ఫ్రారెడ్ ఆధారిత క్షిపణి వ్యవస్థలేనని అంచనా. ముఖ్యంగా మజీద్ ఎయిర్ డిఫెన్ సిస్టమ్ అనే వ్యవస్థను ఇరాన్ వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే, ఇది రాడార్ సంకేతాలను విడుదల చేయదు. అందువల్ల విమానాలకు ముందస్తు హెచ్చరికలు అందడం కష్టమవుతుంది. మజీద్ వ్యవస్థ దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలో, 6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా దాడి చేయగలదు. అలాగే ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ల ద్వారా 15 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. దీని వల్ల లోఎత్తులో ప్రయాణించే యుద్ధ విమానాలు సులభంగా లక్ష్యాలవుతున్నాయి. అమెరికా విమానాలు కచ్చితమైన దాడుల కోసం తక్కువ ఎత్తులో ఎగరడం కూడా ఇరాన్‌కు అనుకూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భుజం పై నుంచి ప్రయోగించే పోర్టబుల్ మిస్సైళ్లు లేదా ఇన్‌ఫ్రారెడ్ గైడెడ్ ఆయుధాలు మరింత ప్రభావవంతంగా మారాయి.
ఇరాన్ రక్షణ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇరాన్ ఖండించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా వాదనలను తప్పుబట్టింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా, ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. కాల్పుల విరమణ అవకాశాలు క్షీణిస్తున్న నేపథ్యంలో, సైనిక ఘర్షణలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో…అమెరికా భారీ రక్షణ రంగానికి భారీగా నిధులు పెంచింది. 2027 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇది ఆధునిక చరిత్రలోనే అత్యధికంగా భావిస్తున్నారు. ఈ ప్రణాళికలో ఆయుధాల పెంపు, నౌకాదళ విస్తరణ, గోల్డెన్ డోమ్ మిసైల్ రక్షణ వ్యవస్థ నిర్మాణం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే సైనికులకు 5 నుంచి 7 శాతం వరకు జీతభత్యాల పెంపు కూడా ప్రతిపాదించారు. సైన్యంలో నియామకాలు పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతూనే, సామాజిక సేవలు, ఆరోగ్య రంగాల్లో ఖర్చులను తగ్గించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. పలు సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. కానీ ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. యుద్ధవిమానాల కూల్చివేత ఘటన ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, చర్చలు ఆగవని ట్రంప్ స్పష్టం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారింది.
హర్మూజ్‌పై అమెరికా పెట్టిన గడువు కొన్ని గంటల్లో ముగియనుండటంతో… అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ జూన్ కాంట్రాక్ట్ 110.58 డాలర్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 1.42 శాతం మేర పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ మే కాంట్రాక్ట్ 111.90 డాలర్లకు ఎగబాకింది. అయితే మే నెలలో చమురు ఉత్పత్తిని పెంచుతామని ఒపెక్ ప్లస్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
అటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థపై ఇరాన్ అణు శక్తి సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అణు కేంద్రాలపై జరిగిన దాడులను IAEA ఖండించకపోవడం స్పష్టమైన సహకారంగా అభివర్ణించింది. IAEA మౌనం పాటించడం అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, దాడులు చేసిన దేశాలకు మద్దతు ఇచ్చినట్టేనని ఇరాన్ ఆరోపించింది. ముఖ్యంగా IAEA పర్యవేక్షణలో ఉన్న కేంద్రాలపైనే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. మార్చి 27న ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్‌పై జరిగిన దాడిలో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు IAEA ధ్రువీకరించింది. ప్రస్తుతం ఆ ప్లాంట్ పనిచేయలేని స్థితిలో ఉందని వెల్లడించింది. ఇదే రోజు ఆర్దకాన్ ప్రాంతంలోని యెల్లోకేక్ ఉత్పత్తి కేంద్రం కూడా దాడికి గురైంది. ఈ తరహా దాడులు రేడియోధార్మిక లీకేజీకి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ హక్కుల సంస్థలు కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అణు కేంద్రాలపై దాడులు కొనసాగితే, ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, మానవీయ విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి.