US Government Shutdown 2025: అగ్రరాజ్యంలో మంగళవారం రాత్రి ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఇంతకీ ఏంటి ఆ సంక్షోభం అని అనుకుంటున్నారా.. యూఎస్ ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. దీంతో అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో పని అర్ధరాత్రి నుంచి, అంటే భారత ప్రామాణిక సమయం ఉదయం 9:30 తర్వాత నిలిపివేయనున్నారు. ఇప్పుడు అమెరికాలో ఏం జరగబోతుంది, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా యూఎస్ ప్రజలు ఎదుర్కొన్నారా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Nizamabad Shocker: భార్యపై అలిగి కరెంట్ పోల్ ఎక్కిన భర్త.. రెండు గంటల పాటు హంగామా!
60 అవసరం కానీ 55 వచ్చాయి..
యూఎస్ ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును ఆమోదించడానికి సెనేట్‌కు 60 ఓట్లు అవసరం. కానీ దానికి అనుకూలంగా 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ ప్రతిపాదన సెనేట్‌లో వీగిపోయింది. ఈసందర్భంగా రిపబ్లికన్ నాయకుడు జాన్ థూన్ బిల్లు వీగిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “డెమొక్రాట్లు ఈ రాత్రి ప్రభుత్వాన్ని మూసివేసారు, కానీ మనం దానిని రేపు తిరిగి తెరవగలం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రిపబ్లికన్ పార్టీ దీనిని “క్లీన్ ఫండింగ్ బిల్లు” అని పేర్కొంది. రాజకీయ కారణాల వల్ల డెమొక్రాట్లు దీనిని ఆమోదించకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. మరోవైపు డెమొక్రాట్లు బిల్లులో ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను విస్తరించాలని, దేశీయ కార్యక్రమాలకు కోతలను తిప్పికొట్టాలని డిమాండ్ చేశారు. గార్డియన్ నివేదిక ప్రకారం.. ఈ ఓటింగ్ తర్వాత, వైట్ హౌస్ బడ్జెట్ ఆఫీస్ అన్ని ప్రభుత్వ సంస్థలు షట్‌డౌన్ ప్రణాళికలను అమలు చేయాలని కోరుతూ ఒక మెమోను జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన బడ్జెట్ డైరెక్టర్ రస్సెల్ వోట్ ఈ నోటీసుపై సంతకం చేశారు. ఈ షట్‌డౌన్ ప్రక్రియకు రిపబ్లికన్లు.. డెమొక్రాట్లను నిందించారు.
తాజా పరిణామాలపై డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమెర్ రిపబ్లికన్ పార్టీపై మాటల దాడి చేశారు. “వారు అమెరికాను షట్‌డౌన్‌లోకి నెట్టారు. లక్షలాది అమెరికన్ కుటుంబాలు ఇప్పుడు తమ బిల్లులు ఎలా చెల్లించాలో అని ఆలోచిస్తూ కూర్చుంటారు” అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో దీనికి రిపబ్లికన్లను బాధ్యులుగా ప్రజలు భావిస్తారని హెచ్చరించారు. ఈ షట్‌డౌన్ అనేక రోజువారీ ప్రభుత్వ సేవలను ప్రభావితం చేస్తుందని, ఆహార భద్రతా తనిఖీలు, విమాన ప్రయాణ నియంత్రణ, ఫెడరల్ కోర్టులు, ఇతర ముఖ్యమైన సేవలు దీంతో ప్రభావితమవుతాయని చెప్పారు. 1980 నుంచి USలో 14 షట్‌డౌన్‌లు జరిగాయని ఒక నివేదిక తెలిపింది. 2018 -19లో ట్రంప్ పదవీకాలంలో 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. అమెరికాలో అత్యధిక సమయం కొనసాగిన షట్‌డౌన్‌గా ఇది చరిత్ర సృష్టించింది.
అమెరికా షట్‌డౌన్ అంటే ఏమిటి?
అమెరికాలో సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వాన్ని నడపడానికి నిధులు మంజూరు చేయడంలో US కాంగ్రెస్ విఫలమైనప్పుడు ప్రభుత్వ షట్‌డౌన్ జరుగుతుంది. US రాజ్యాంగం ప్రకారం.. ప్రభుత్వ విభాగాలు, కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి కాంగ్రెస్ ఏటా ఒక బిల్లును ఆమోదించాలి. ఈ బిల్లును ఆమోదించకపోతే ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి అధికారం లభించదు. దీని ఫలితంగా వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను జీతం లేకుండా సెలవుపై పంపుతారు. అనేక మంది ఇతర ఉద్యోగులు జీతం లేకుండా పని చేయవలసి వస్తుంది. సైనిక అధికారులు, రిజర్వ్ దళాలు పనికి రిపోర్ట్ చేస్తూనే ఉంటారని, కానీ వారికి ప్రస్తుతానికి జీతం అందదని రక్షణ శాఖ స్పష్టంగా పేర్కొంది.
READ ALSO: October 1 Rule Changes India: అలర్ట్.. నేటి నుంచి మారుతున్న ఈ కీలక విషయాలు మీకు తెలుసా!