సివిల్స్ నోటిఫికేషన్ (UPSC Civil Notification) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఫిబ్రవరి 14న మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు upsconline.nic.inను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం నుంచి మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. దీంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ ఇచ్చింది.
UPSC CSE నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫారమ్‌ను కూడా విడుదల చేసింది. దరఖాస్తు చేయడానికి ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి పొరపాటు జరగకూడదు. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవడం అవసరమై ఉంటుంది. UPSC పరీక్షకు మూడు వారాల ముందు అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేస్తారు.