టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాపై పాకిస్థాన్ గెలవడంతో మనదేశంలో చాలా మంది విజయోత్సవాలు జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకోగా.. మరికొన్ని చోట్ల స్వీట్లు పంచుకున్నారు. దీంతో ఈ వేడుకలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు భారతీయులు ఈ వీడియోలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. క్రికెటర్లు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్లు కూడా స్పందించి తమదైన శైలిలో సెటైర్లు వేశారు.
Read Also: ఐక్యరాజ్యసమితిలో డైనోసార్… పర్యావరణంపై చురకలు
అయితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం మరో అడుగు ముందుకేశారు. పాకిస్థాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకునే భారతీయులపై దేశద్రోహం కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉంటూ మన ప్రత్యర్థి పాకిస్థాన్ గెలిస్తే సంబరాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సీఎం కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది.