పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పురపాలక సమావేశానికి మొత్తంగా 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వైస్ ఛైర్మన్‌గా 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతిని కౌన్సిలర్ ప్రతిపాదించగా.. మిగిలిన కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
మరోవైపు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. గొడవను అదుపు చేస్తున్న పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదంకు దిగారు. వైసీపీ నేత దాడి శెట్టి రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తుని మున్సిపల్ కార్యాలయానికి 10 మంది టీడీపీ కౌన్సిలర్లు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. దాంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.
తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 30 స్థానాలలో వైసీపీ గెలిచింది. ఒక కౌన్సిలర్ మృతి చెందగా, మరొక కౌన్సిలర్‌కి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. 28 మంది కౌన్సిలర్లు వైసీపీకి చెందిన వారే. నాలుగు రోజుల కింద పది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా.. మ్యాజిక్ ఫిగర్ 15. తుని ఎమ్మెల్యే దివ్యకి ఎక్స్ అఫిషియో ఓటు ఉండగా.. మరొక నలుగురు కౌన్సిలర్లు తమకు టచ్‌లో ఉన్నారని టీడీపీ అంటోంది. తుని మున్సిపల్ చైర్మన్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఎన్నిక జరుగుతుందా? లేదా వాయిదా పడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.