Union Minister Subhas Sarkar Locked Up In Party Office by Own Party Workers: కేంద్రమంత్రిని సొంతపార్టీ కార్యకర్తలే గదిలో బంధించి తాళం వేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బంకురాలో జరిగింది. పార్టీ కార్యకలాపాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ ను గదిలో బంధించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం బంకురాలోని బీజేపీ కార్యాలయంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ హాజరయ్యారు. అయితే జిల్లా రాజకీయ వ్యవహారాల్లో నియంతలా వ్యవహరిస్తున్నారని కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ అక్కడి వచ్చి ఆయనను గదిలో బంధించారు. అంతటితో ఆగకుండా ఆ గదికి తాళం కూడా వేశారు.
విషయం తెలుకసుకున్న ఆయన మద్దతుదారులు వెంటనే పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయనను విడిపించే ప్రయత్నం చేశారు. అయితే దీనిని మిగిలిన వారు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు మంత్రిని బయటకు విడిపించారు. సుభాష్ సర్కార్ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ ఆవేదనతోనే ఆయనను బంధించినట్లు చెప్పారు. ఆయన వల్ల జిల్లాలో పార్టీ బలహీన పడుతుందని, పార్టీని కాపాడేందుకే నిరసన తెలుపుతున్నట్లు వెల్లడించారు బీజేపీ కార్యకర్త మోహిత్ శర్మ . ఈ చర్యలో పాల్గొన్న కొంత మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుభాష్ సర్కార్ అసమర్థత వల్ల ఈసారి బంకుర మున్సిపాలిటీ లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్‌లోని బంకుర లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికైన సుభాష్ ప్రస్తుతం ప్రధాని మోడీ కేబినెట్‌లో విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు