Union Minister Kishan Reddy: గుంటూరు రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నుంచి హుబ్లీకి, గుంటూరు నుంచి విశాఖకు, రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రైళ్లను ప్రారంభించామని, నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు. ఏపీలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు పూర్తయిందన్నారు. గతంలో 2014లో 886 కోట్లుగా ఉన్న ఏపీ రైల్వే బడ్జెట్ నేడు 8 వేల కోట్ల బడ్జెట్‌గా మారిందన్నారు. ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రపంచం రైల్వే నెట్ వర్క్‌లలో భారత్ నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశమని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు లో ఉండే ప్రయాణం రైల్వే అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. భారత దేశంలో ప్రతి రోజూ 1200 రైళ్లు రెండు కోట్ల మందికి సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రతి టిక్కెట్‌పై యాభై మూడు శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా ప్రధాని మోడీ చర్యలు చేపట్టారన్నారు.
Read Also: Buddha Venkanna: కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం.
దేశంలో ప్రతి రోజూ 16 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్ భారత్ కింద హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏపీలో 5 వందే భారత్ రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన పదేళ్లలో ఐదు లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆర్యూబీ ,ఆర్‌వోబీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సాంప్రదాయ ఉత్పత్తులు తయారు చేసే వారు అమ్మకాలకు వీలుగా రైల్వేలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో హై స్పీడ్ ఇంటర్ నెట్, వైఫై సౌకర్యం ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: MP Vijayasai Reddy: మూడు లిస్టులు రిలీజ్ చేశాం.. త్వరలో మరో జాబితా..
భారతదేశంలో ఏ ప్రధాని సాధించలేని అభివృద్ధి నరేంద్ర మోడీ సాధించారన్నారు. రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ చరిత్రలో నిలవనున్నారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించాం… అన్ని వర్గాలు మోడీకి మద్దతు గా నిలవనున్నాయి.. మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించిందన్నారు. దేశంలో ఏ గ్రామం వెళ్లినా ఏ పట్టణం వెళ్లిన మోడీ పేరు వినపడుతుందని.. గత తొమ్మిదేళ్లుగా అవినీతి రహిత పాలన సాగుతుందని తెలిపారు. మౌలిక వసతులు కల్పనలు మోడీ ప్రయత్నించారని.. సుస్థిర పాలన మోడీ నాయకత్వంలో సాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.