పారా మిలటరీ జవాన్లతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సతీమణి కావ్యతో కలిసి పారామిలటరీ జవాన్లకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా కుటుంబాలను వదిలి నిరంతరం దేశసేవలో పనిచేస్తున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబసభ్యులకు దీపావళి సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ‘140 కోట్ల మంది భారతీయులే మీ కుటుంబ సభ్యులుగా.. మా అందరి భద్రతకోసం, దేశ భద్రత కోసం అహోరాత్రులు మీరు చేస్తున్న సేవ మరువలేనిది. అందుకే మీతో కలిసి దీపావళి జరుపుకునేందుకు రావడం చాలా సంతోషంగా ఉంది’. అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Read Also: AP Free Gas Scheme: రేపు శ్రీకాకుళంలో సీఎం పర్యటన.. ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం..
పదేళ్ల క్రితం వరకు దేశంలో ఎటుచూసినా ఉగ్రవాదుల అలజడి.. బాంబు దాడి ఘటనల గురించి రోజూ వార్తలు వచ్చేవని అన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గమైన సికింద్రాబాద్ గడ్డమీద ఐపీఎస్ కృష్ణప్రసాద్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారని.. వేలాది మంది కానిస్టేబుళ్లు, కిందిస్థాయి సిబ్బంది కూడా దేశంలో వేర్వేరు ఉగ్ర ఘటనల్లో అమరులయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వేర్పాటువాదం కారణంగా కూడా చాలా మంది జవాన్లు బలయ్యారని తెలిపారు. ఏకంగా పార్లమెంటు భవనంపైనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.. కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడటం లక్ష్యంగా మోడీ సర్కారు పనిచేస్తోందని అన్నారు. ఈ ప్రయత్నంలో సాయుధబలగాల కృషి అత్యంత కీలకమైనది.. నరేంద్ర మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ఒక్కొక్కటిగా రూపుమాపుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: November 1st Rules Change: నవంబర్ నెలలో మార్పులు కానున్న పలు నిబంధనలు ఇవే
మోడీ సర్కారు నిర్ణయాల కారణంగా.. గత పదేళ్లలో దేశంలో ఎలాంటి ఉగ్రఘటనలు జరగలేవని చెప్పారు. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం.. వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం, ఇందుకోసం వ్యూహాత్మక విదేశీ విధానాన్ని అవలంబించడం వల్ల మన దేశం ఆ గడ్డు సమస్య నుంచి బయటకు వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. అందుకే మోడీ ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం ద్వారా దేశంలో పెట్టుబడులను, పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే సంకల్పంతో మోడీ ముందుకెళ్తున్నారు.. ఇందుకోసం దేశవ్యాప్తంగా శాంతియుత వాతావరణం కొనసాగడం చాలా అవసరం అని అన్నారు. అందుకు సాయుధ బలగాల పాత్ర కీలకమైనది.. మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు.