Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేశారని.. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు. దక్షిణ భారతంలో బీజేపి బలపడుతుందని.. కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందన్నారు. తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామన్నారు. తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు మా దగ్గర 15వందల రోజుల ప్రణాళిక ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద దాటలేదన్నారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని.. అయినా వారి నేత అహంకారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మూడోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని.. ఇండియా కూటమికి నాయకత్వమే లేదన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమాన పరుస్తుందని.. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదన్నారు. మోడీ ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లకు ఎటువంటి డోకా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి అని.. ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. గత పదేళ్లలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారం అందించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్‌లో బీజేపీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కొత్త పాత లేదన్న ఆయన.. బీజేపీలో చేరిన వారందరూ పాత వారేనన్నారు. ఈటల పార్టీకి కొత్త కాదు ఆయన పాత అయిపోయాడని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ – బీఆర్‌ఎస్‌లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుందన్నారు.
ఊర్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలని.. అప్పుడే స్థానికంగా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. టాప్ 5 ఎకనామిక్ సిటీస్‌లో హైదరాబాద్ ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనేది నేతల పదవుల కోసం కాదని.. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమేనన్నారు. నీట్ అంశం సుప్రీం కోర్టులో ఉంది.. త్వరలో తేలుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ అంశంపై మాట్లాడేందుకు ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారు. లోకల్ బాడి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.