Union Budget 2026: భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఆదివారం) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల సంప్రదాయాన్ని మారుస్తూ.. ఈసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరిగింది.
ఈ బడ్జెట్‌ను మూడు ప్రధాన కర్తవ్యాల (Duties) ప్రాతిపదికన రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానించడంతో పాటు.. యువత, పేదలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చడం వంటి వాటిని పొందుపరిచారు.
Union Budget 2026: రేర్ ఎర్త్ ఖనిజాలకు పెద్ద పీట.. సెమీ-కండక్టర్ ఇండస్ట్రీకి రూ. 40,000 కోట్లు..
దేశాభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఈసారి రికార్డు స్థాయిలో రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇది రూ. 11.2 లక్షల కోట్లుగా ఉండేది. మరోవైపు సెమీకండక్టర్ & టెక్నాలజీలో విప్లవం సృష్టించేలా ప్రకటన చేశారు. ఇందులో సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కింద చిప్ తయారీలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు రూ. 40,000 కోట్లు కేటాయించారు.
అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. అలాగే పరిశ్రమలను విద్యాసంస్థలతో అనుసంధానం చేస్తూ కొత్తగా హైటెక్ టూల్ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో బయో ఫార్మా తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.
Union Budget 2026: కాంచీవరం చీరలో నిర్మలా సీతారామన్.. 9 బడ్జెట్లు 9 రకాల చీరలు..
ఇక ఫార్మా విద్యా సంస్థలు సంబంధించి జాతీయ స్థాయిలో మూడు కొత్త ఫార్మా విద్యా, పరిశోధనా సంస్థలను స్థాపించనున్నారు. ఇంకా జౌళి రంగంలో ఉపాధి పెంచేందుకు మెగా పార్కుల ఏర్పాటుతో పాటు, అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఇంకా దేశంలో కొత్తగా మూడు ప్రపంచ స్థాయి రసాయన పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
వీటితోపాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ స్థాయి కంటైనర్ తయారీ కార్పొరేషన్ స్థాపన ఏర్పాటు కానుంది. ముఖ్యంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే దిశగా కొత్త ఫైబర్ పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. “సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్” మంత్రంతో 2025 ఆగస్టు తర్వాత ప్రభుత్వం 350కి పైగా సంస్కరణలు తీసుకువచ్చిందని, 7 శాతం వృద్ధి రేటుతో భారత్ స్థిరంగా ముందుకు సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు.
