దేశంలో ఐదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు వస్తుంటాయి. ఇక 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. కానీ యూత్ మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. నిరక్షరాసులు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. యువత మాత్రం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇష్టపడరు. ఓ వైపు ఎన్నికల అధికారులు ప్రచారం చేసినా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తొలిసారి యూజీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్త ఓటర్ల నమోదు కోసం క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా కొత్త ఓటర్లను ప్రేరేపించేందుకు యూజీసీ క్యాంపెయిన్ ప్రారంభించింది. యువ ఓటర్లు, మరీ ముఖ్యంగా కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి అవగాహన పెంచేందుకు కార్యాచరణను మొదలుపెట్టింది.
దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఓటు వేసేందుకు యువతను సమీకరించి.. వారిలో ప్రేరణ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇందులో భాగస్వాములు కావాలని జగదీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ ప్రచారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, విద్యాశాఖ, ఇతర వనరుల నుంచి సమకూరిన మెటీరియల్‌తో పాటు వీడియోలు, బ్యానర్లు, సెల్ఫీ పాయింట్లను ఉపయోగించుకుంటాయని చెప్పారు.
బుధవారం ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ మార్చి 6 వరకు కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో నిర్దేశిత ప్రదేశాల్లో ఈ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాయన్నారు.