Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పెద్ద కుమారుడు ఉదయనిధి వచ్చేవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర కనబర్చిన యువ నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ గుర్తింపు పొందారు. తన తాత కరుణానిధికి అసలైన వారసుడిగా తండ్రి ఎంకే స్టాలిన్‌కు సిసలైన తనయుడిగా ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తండ్రికి కుడి భుజంగా ఉన్నారు.
ఉదయనిధి స్టాలిన్ చెపాక్ – తిరువల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, మిత్రపక్షాల తరఫున ఉదయనిధి స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. యువతను కూడగట్టడంలో వారిని చేరదీయడంలో, ఓట్లుగా మలచడంలో కీలక పాత్ర పోషించారు. ఆపై డీఎంకే పవర్‌లోకి రావడంలో ముఖ్య భూమిక పోషించాడు ఉదయనిధి స్టాలిన్. ఆయనకు రైజింగ్ సన్‌గా పేరుంది. స్టాలిన్ కుటుంబం నుంచి ఎదిగిన మూడో తరం నాయకుడు.
డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా పని చేస్తున్న ఉదయనిధి స్టాలిన్‌కు గ్రామీణాభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల పోర్ట్‌ఫోలియో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. 46 ఏళ్ల యువకుడు 2019లో యూత్ వింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన తండ్రి ఎంకే స్టాలిన్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ పదవిలో ఉన్నారు. 2018లో తన తండ్రి కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడయ్యారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
Parliament Sessions: “జీ20 సమ్మిట్.. భారత సామర్థ్యాలను ప్రదర్శించేందుకు సువర్ణావకాశం”
ఉదయనిధి పలు తమిళ సినిమాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది తమిళనాడు ఎన్నికలలో నటుడు-రాజకీయవేత్త స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరిగా ఎదిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై దాడి చేయడంతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు. గత కొన్ని నెలలుగా ఉదయనిధి ఔన్నత్యం కొనసాగుతోందని, మంత్రిగా క్యాబినెట్‌లోకి ప్రవేశించేలోపు ఆయన తన నటనా బాధ్యతలను పూర్తి చేయాలని నాయకత్వం వేచి ఉందని వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో జరిగిన గ్రాండ్ బర్త్‌డే వేడుకలే ప్రభుత్వంలో, పార్టీలో ఆయనకున్న పలుకుబడికి నిదర్శనం. ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని, డీఎంకే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా మంది పార్టీ నాయకులు ఆయనను కోరుతున్నారు.