Uday Kotak: దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన వివరాలను బ్యాంక్ సెప్టెంబర్ 2న ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్‌లో తెలిపింది. అయితే ఉదయ్ కోటక్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రతిపాదిత వారసుడి కోసం బ్యాంక్ ఆర్బీఐ ఆమోదం కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర ఏర్పాటుగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకు ఆర్‌బీఐ, బ్యాంక్ సభ్యుల ఆమోదానికి లోబడి ఎండీ అండ్ సీఈవోల బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది.
Also Read: DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.27,000 పెరగనున్న జీతం?
వ్యవస్థాపకుడిగా తాను కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నానని ఉదయ్ కోటక్ వెల్లడించారు. సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగిస్తానని.. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ నిర్వహణ బృందం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపకులు వెళ్లిపోయినా కానీ సంస్థ శాశ్వతంగా ముందుకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలు ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించటం చూశానని ఆయన తెలిపారు. దేశంలో గొప్ప ఆర్థిక సంస్థను సృష్టించాలనే కలతోనే తాను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభించానని ఉదయ్ కోటక్ గుర్తుచేసుకున్నారు.