ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని జవహర్‌నగర్‌లోని తన నివాసంలో స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు.
యాంకర్ స్వేచ్ఛకు 2014లో భర్త క్రాంతి కిరణ్‌తో విడాకులు అయ్యాయి. ఆపై కొన్ని రోజుల పాటు రాంనగర్లో తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి నివాసం ఉన్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం స్వేచ్ఛ తన కూతురితో కలిసి ఒంటరిగా జవహర్‌నగర్‌లోని శీలం రెసిడెన్సిలో పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. స్వేచ్ఛ స్నేహితుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడని సమాచారం. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందింది. ఇంట్లోకి వెళ్లి చూడగా స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు.
Also Read: Visakha Drinking Water: విశాఖ నగరానికి మంచినీటి ముప్పు!
సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. యాంకర్ స్వేచ్ఛ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.