Tummala Nageswara Rao : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే 33 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేసినట్లు తెలిపారు. రైతుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ ప్రభుత్వమే చేపట్టనుందని వెల్లడించారు. రైతులు అనుమతి లేని కంపెనీల విత్తనాలు, లూజ్ విత్తనాలు తీసుకోకుండా, ప్రభుత్వం అందించే నాణ్యమైన విత్తనాలే వాడాలని సూచించారు. కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చేనేత రంగం గుండె చప్పుడు ఆగకూడదని, నేతన్నల కన్నీరు తుడిచేలా ప్రభుత్వం అన్ని శాఖలకూ టెస్కో ద్వారా కొనుగోళ్లను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల వద్ద నుంచే కొనుగోలు చేస్తామని, ఈ విధంగా నేతన్నల ఆర్థిక స్థితిని మెరుగుపరచే ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఇక ఉపాధి అవకాశాల విషయానికి వస్తే, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు తిరిగి తమ సొంత రాష్ట్రమైన తెలంగాణకు రావాలన్న ఉద్దేశంతో ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. రానున్న నాలుగేళ్లలో తెలంగాణను దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చుపెట్టే సొమ్ముతో కేంద్ర పథకాలు నడుస్తున్నాయన్నారు. అయినా కేంద్రమంతటా తమ ఫోటోలు పెట్టించుకుంటున్నారని, ప్రజల సొమ్ముతో ప్రజలకే మేలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పథకాలు ఎవరి వ్యక్తిగత సంపత్తి కాదని, ఇవి ప్రజల హక్కు అన్నారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేశారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒక్కొక్క రైతు గుండెల్లో భరోసా నింపేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.