TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం రానే వచ్చింది.. జులై మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఆన్‌లైన్‌లో పెట్టనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ రోజు ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించి లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది.. ఇక, ఉదయం 11:30 గంటలకు జులై మాసానికి సంబంధించిన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.. మరోవైపు.. ఈ రోజు మధ్యహ్నం 3 గంటలకు జులై నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు టీటీడీ అధికారులు.
Read Also: Sri Datta Stotram: మనోభీష్టాలు నెరవేరాలంటే శ్రీ దత్తాత్రేయ స్తోత్రం వినండి
ఇక, రేపు ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల కానుండగా.. రేపు మధ్యహ్నం 3 గంటలకు మే నెలకు సంబంధించిన వయోవృద్దులు, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.. మరోవైపు.. నిన్న 61,050 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. వారిలో 22,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.55 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. కాగా, టీటీడీ ఆ టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టినా.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోటా మొత్తం పూర్తి అవుతూ వస్తున్న విషయం విదితమే.. దీనిని దృష్టిలో ఉంచుకుని.. భక్తులు ప్లాన్ చేసుకుంటే మంచిది.