TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధ (AI)ని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో ఔట్‌సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది. శాశ్వత సిబ్బంది స్థానంలో ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడటం వల్ల భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
విరాళాల లెక్కింపులో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా విరాళాల కౌంటింగ్ ప్రక్రియలో భక్తులను కూడా ఎందుకు భాగస్వాములుగా తీసుకోకూడదని ప్రశ్నించింది. అయితే ఆగమన శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తం అయ్యేలా విజిలెన్స్ అధికారులు అలర్ట్ టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో హ్యూమన్ ఇంటర్‌ఫెరెన్స్‌ను సాధ్యమైనంతవరకు తగ్గించి, పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. చివరగా ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Eat Curd in Winter: చలికాలంలో గడ్డ పెరుగు తింటున్నారా.. అయితే వీటిని తెలుసుకోండి..