తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, నవాజ్ బాషాలు ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి శాసనసభ్యులు కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని భూమన చెప్పారు. దాంతో తిరుపతి గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
తిరుపతి ఎస్వీ గోశాలకు రావాలని, అవసరమైన భద్రత కల్పిస్తామని భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డి ఫోన్లో చెప్పారు. ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ భద్రత ఎర్పాటు చేస్తామని సుధీర్ చెప్పగా.. పోలీసులు అనుమతి ఇస్తే వస్తానంటూ భూమన సమాధానం ఇచ్చారు. ‘టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని గృహనిర్బంధం చేయలేదు. ఎస్వీ గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. రెండు పార్టీల నేతలు ఒకే సారి వెళ్లకూడదని సూచించాం. భూమన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో వెళ్లవచ్చని సూచించాం’ అని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
ఎస్వీ గోశాలకు కూటమి ఎమ్మెల్యేల బృందం ఇప్పటికే చేరుకుంది. అయితే టీడీపీ కేడర్, నేతలను మాత్రం పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వలేదు. దాంతో టీడీపీ కేడర్, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. భూమన కరుణాకర్ రెడ్డి రాక కోసం కూటమి ఎమ్మెల్యేల బృందం గోశాల వద్ద ఎదురుచూస్తున్నారు. భూమన వస్తేనే గోశాల లోపలికి వెళుతామంటున్నారు. ప్రస్తుతం ఎస్వీ గోశాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.