Bhumana Karunakar Reddy: తిరుపతిలో 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన వినాయక సాగర్‌ను టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. స్థానికుల కోరిక మేరకు వినాయక సాగర్ మధ్యలో వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఒకప్పుడు లింగాలమ్మ చెరువు పేరుతో ఈ ప్రాంతం రైతుల పాలిట కల్ప తరువుగా ఉండేదని.. సరైన కాలువలు లేకపోవడం వల్ల డ్రైనేజీ చెరువుగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం లింగాలమ్మ చెరువును ఆధునీకరించడంతో పాటు వినాయక సాగర్ అని పేరు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చెరువు తిరుపతికే ఓ మణిహారంగా నిలిచిందని, ఓ ఆభరణంగా మారిందన్నారు.
Also Read: Vasireddy Padma: చంద్రబాబు లాగా కేసుల గురించి ఆయన కన్నీళ్లు పెట్టుకోలేదు..
వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నామని భూమన వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాలకు నగర పాలక సంస్థ కార్యాలయమే ప్రధాన వేదికగా నిలబోతోందన్నారు. ఇతర ప్రాంతాల వారెవరైనా తిరుపతి వైపు చూసే విధంగా అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే వినాయక సాగర్ ప్రాంతంలో రెండు మూడు వేల మంది వాకర్స్ వాకింగ్ కోసం వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. శ్రీ కృష్ణజన్మాష్టమి పర్వదినాన ఇంత మంచి ప్రాజెక్టును ప్రారంభించుకోవడం శుభకరంగానూ భావిస్తున్నామన్నారు.