తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) జీఓ 111 పరిధిలోని స్టోన్ క్రషింగ్ యూనిట్లపై రూ.5.5 కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధించింది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 111 ప్రకారం.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి, నిర్మాణ పనులను నిషేదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. జీఓ 111 ప్రాంతంలో నిర్వహిస్తున్న అక్రమ, అనధికార స్టోన్ క్రషర్ యూనిట్లపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సౌత్ బెంచ్‌లో హైదరాబాద్‌కు చెందిన పీవీ సుబ్రమణ్య వర్మ పిటిషన్ దాఖలు చేయడంతో పెనాల్టీ విధించారు.
Also Read : Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్
రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని వట్టినాగులపల్లి, కోకాపేట్, గౌల్దొడ్డి, గోపన్‌పల్లి, కొల్లూరు, కొత్వాల్‌గూడ, ఉస్మాన్‌నగర్ గ్రామాల్లో క్రషర్లు ఉన్నాయి. అక్టోబర్ 14న జరిగిన విచారణ అనంతరం తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీసీబీని ఎన్జీటీ ఆదేశించింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ సరస్సుల 10కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్టోన్ క్రషింగ్ యూనిట్లలో బోర్డు అధికారులు అక్టోబర్, నవంబర్‌లో తనిఖీలు చేపట్టారు. బోర్డు అనుమతి లేకుండా యూనిట్లను నిర్వహించడం, బోర్డు మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగించడం, పర్యావరణానికి హాని కలిగించడం వంటి కారణాలతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా ఉల్లంఘించిన యూనిట్లకు నోటీసులు జారీ చేసింది.
టీఎస్‌పీసీబీ, జోనల్ కార్యాలయాలు, హైదరాబాద్ మరియు ఆర్‌సి పురం జోనల్ కార్యాలయంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందు విచారణ నిర్వహించి పర్యావరణ పరిహారం వసూలు చేయాలని సిఫార్సు చేసింది. అనంతరం ఒక్కో స్టోన్ క్రషర్ యూనిట్ కు రూ.8.45 లక్షల నుంచి రూ.91 లక్షల వరకు పరిహారం విధించారు. జరిమానాతో కూడిన యూనిట్లలో శేరిలింగంపల్లిలోని గ్రేట్ ఇండియా మైనింగ్, శ్రీ లక్ష్మీ నరసింహ మెటల్ ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్, హైదరాబాద్ రాక్ సాండ్, ఆదేశ్వర్ ట్రేడర్స్, తేజా రెడ్డి క్రషర్స్, సిఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (క్రషర్) ఉన్నాయి. వట్టినాగులపల్లికి చెందిన పేరులేని స్టోన్ క్రషర్, గండిపేటకు చెందిన షామా మెటల్ సప్లై, డీబీఆర్ మెటల్ ఇండస్ట్రీ, కొత్వాల్‌గూడకు చెందిన SMI స్టోన్ క్రషర్ (షామా మెటల్ ఇండస్ట్రీ), శ్రీ సాయి బాలాజీ రాక్ సాండ్ ఇండస్ట్రీ ఉన్నాయి..