న్యాయ విద్యలో చేరేందుకు ప్రయత్నిస్తు్న్న అభ్యర్థులకు తెలంగాణ లాసెట్ అధికారులు శుభవార్త తెలిపారు. తెలంగాణ లా సెట్ (TS LAWCET 2024) అప్లికేషన్ గడువు ఏప్రిల్ 15తో ముగియడ నుండగా.. అధికారులు గడువును పెంచారు. ఏప్రిల్ 25వ తేదీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ గడువు సైతం అయిపోవడంతో మరోసారి గడువు పెంచుతూ.. లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ప్రకనట విడుదల చేశారు. మే 4వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా లాసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. లా కోర్సు చదవాలనుకునే విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశంగా మారింది. ఓబీసీలు- రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- రూ. 600 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్ ఎంట్రెస్ ఎగ్జామ్ జరగనుంది. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష ఉంటుంది. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
READ MORE: Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
అర్హత గల అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి.. మొదట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తరువాత వివరాలన్నీ క్రమపద్ధతిలో నమోదు చేసి.. అభ్యర్థి ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత వెంటనే దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫారమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ తప్పనిసరిగా అవసరపడుతుంది. 2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కళాశాలల్లో మూడేళ్లు, అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. 3 సంవత్సరాల కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ, ఎస్టీలు 40% మార్కులు సాధించి ఉండాలి. విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. వయోపరిమితి లేదు. లాసెట్ ప్రవేశ పరీక్షకు 90 నిమిషాల సమయం ఉంటుంది. 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అయిదేళ్లు, మూడేళ్ల కోర్సులకు సంబంధించి వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.