Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..

Trump Comments

Trump Comments

Trump: భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్ మధ్య జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) వెనుక అంతర్జాతీయంగా ఏం జరిగిందనే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అభ్యర్థన మేరకే తాము ఈ కాల్పుల విరమణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నామని స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని తాను అంతగా ఇష్టపడలేదని, కానీ పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చాలా రిక్వెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. వాళ్లకు ఒక ‘ఫేవర్‌’లా (సహాయంలా) సీజ్‌ఫైర్‌పై చర్చించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలోని యాంకరేజ్ నగరానికి ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రధానిని, ఆర్మీ చీఫ్‌ను ‘టెర్రిఫిక్ పీపుల్’ (అద్భుతమైన వ్యక్తులు) అని అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాకిస్థాన్ వెళ్లినట్లు ఈ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది.

అయితే, ఈ కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ గతంలో గమ్మత్తు ప్రకటన చేశారు. భారతే స్వయంగా అమెరికాను ఆశ్రయించి, మధ్యవర్తిత్వం వహించాలని కోరిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మునీర్ మాట్లాడుతూ… భారత్ అమెరికా నాయకత్వం ద్వారా మధ్యవర్తిత్వం కోసం ఆసక్తి చూపించిందని, ప్రాంతీయ శాంతిని కాంక్షించి పాకిస్థాన్ దానికి అంగీకరించిందని డాన్ న్యూస్ వేదికగా వ్యాఖ్యానించారు. కానీ, ఈ వ్యవహారంలో అసలు నిజాలు అమెరికాలోని ‘ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ (FARA) ద్వారా బయటపడ్డాయి. భారత్ అడిగిందని పాక్ ఆర్మీ చీఫ్ చెప్తున్న మాటలు అబద్ధమని అమెరికా అధికారిక లాబీయింగ్ పత్రాలు నిరూపిస్తున్నాయి. మే 6 నుంచి మే 9, 2025 మధ్య కాలంలో పాకిస్థానే స్వయంగా అమెరికాలో పెద్ద ఎత్తున దౌత్యపరమైన లాబీయింగ్ జరిపినట్లు ఈ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సహాయకులు, రక్షణ రంగానికి చెందిన అధికారులు, ట్రెజరీ అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు, జర్నలిస్టులతో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు సంప్రదింపులు జరిపిందని ఏఎన్ఐ సమీక్షించిన ఈ పత్రాలు వెల్లడించాయి.

పాకిస్థాన్ అమెరికా చుట్టూ ఇంతలా ప్రదక్షిణలు చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. పాకిస్థాన్, అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. మే 6, మే 7 రాత్రి వేళల్లో భారత సాయుధ దళాలు ముప్పేట దాడి (ట్రై-సర్వీసెస్ ఆపరేషన్) చేస్తూ… ఉగ్రవాదులకు చెందిన 9 కీలక స్థావరాలు ధ్వంసం చేశాయి. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. భారత్ దెబ్బకు భయపడిపోయిన పాకిస్థాన్, ఆ దాడులను ఆపించడం కోసమే అమెరికా కాళ్లబేరానికి వెళ్లి లాబీయింగ్ చేసింది. చివరకు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ సాధ్యమైందని ఈ తాజాగా స్పష్టమైంది.