Trinamool Leaders Killed: పశ్చిమ బెంగాల్లో శుక్రవారం రెండు దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడితో పాటు అతడి కుటుంబసభ్యులు హత్యకు గురికాగా.. మరో ఘటనలో పార్టీ మద్దతుదారు హత్యకు గురయ్యారు. ఓ ఘటన ఉత్తర బెంగాల్లో జరగగా.. మరొకటి నదియా జిల్లాలో జరిగింది.
పదునైన కత్తులతో టీఎంసీ నేత కుటుంబంపై దాడి
విభూతి భూషణ్ రాయ్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి పంచాయతీ స్థాయి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు 68 ఏళ్ల బిమల్ కుమార్ బర్మాన్ ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో అతని కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు పోలీసులకు తెల్లవారుజామున 4.40 గంటలకు సమాచారం అందింది. తీవ్రంగా గాయపడిన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించగా, దాడిలో తృణమూల్ నాయకుడు, అతని భార్య, 24 ఏళ్ల పెద్ద కుమార్తె మరణించారు. బిమల్ బర్మాన్ చిన్న కుమార్తె ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉంది.హత్యల్లో ప్రధాన నిందితుడు విభూతి భూషణ్ రాయ్‌పై ప్రజలే దాడి చేశారని, ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు. అతను కూడా ఆసుపత్రిలో చేరాడు. ఈ నేరానికి సంబంధించి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బిమల్ బర్మాన్ కుమార్తెలలో ఒకరికి, ప్రధాన నిందితుడికి మధ్య ఉన్న అనుబంధం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, సాధ్యమయ్యే అన్ని కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తృణమూల్ నేత అహ్మద్ అలీ బిశ్వాస్ కాల్చివేత
మరో కేసులో పట్టపగలు జరిపిన కాల్పుల్లో తృణమూల్ మద్దతుదారుడు చనిపోయాడు. వృత్తిరీత్యా రైతు అయిన అహ్మద్ అలీ బిస్వాస్ నదియా జిల్లా తృణమూల్ మద్దతుదారుగా పేరుగాంచాడు. మోటర్‌బైక్‌పై వచ్చిన ముష్కరులు అహ్మద్ బిస్వాస్‌పై పలు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుండగులతో మృతుడు కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడని, ఆపై కొద్ది నిమిషాలకే దుండగుల్లో ఓ వ్యక్తి అతడిపై తుపాకీతో కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో టీఎంసీ నేత అహ్మద్ అలీ బిశ్వాస్ అక్కడికక్కడే మరణించారు. స్ధానికులు తృణమూల్ నేతను బగులా గ్రామీణ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితులు ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. హత్యకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు దేవాశిష్ గంగూలీ అన్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయని అన్నారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందిస్తూ.. ‘‘పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ హత్యల ఘటనలు పెరుగుతాయి. టీఎంసీ టిక్కెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై పెద్దఎత్తున పోరు సాగుతోంది. ఎందుకంటే టీఎంసీ టికెట్ పొందడం అంటే మొదట దోపిడీ. ఓట్లు వేసి ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత ప్రజలను దోచుకోవడం.. ఇదీ వారి ఆలోచన విధానం. ఒక టీఎంసీ నాయకుడు అహ్మద్ అలీ బిశ్వాస్ హత్యకు గురయ్యాడు. వారు బీజేపీని ఎలా నిందించడానికి ప్రయత్నించారో.. మనం ఇంతకు ముందు చూసినట్లుగా బీజేపీని నిందించడానికి ప్రయత్నిస్తారు.” అని ఆయన తెలిపారు.