రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రహదారి భద్రత సమస్యలపై అవగాహన కల్పించేందుకు, వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని పురుషులు, మహిళా డ్రైవర్లకు మహిళా పోలీసులు రాఖీలు కట్టారు. అందుకు ప్రతిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని అధికారులు ఈ ఉల్లంఘనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎల్‌బీ నగర్ నుంచి ప్రారంభమైన ఈ డ్రైవ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. “ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి మహిళా కానిస్టేబుళ్లు రాఖీలు కట్టారు.
ట్రిపుల్ రైడ్ చేయకూడదని లేదా అతివేగంగా నడపకూడదని మరియు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్‌లు పెట్టుకోవాలని మేము ప్రజలకు అవగాహన కల్పించాము. కానీ ఎవరు పాటించకపోయినా వారికి రాఖీ కట్టారు” అని ఓ అధికారి తెలిపారు. ఈ చొరవ పౌరుల నుండి కూడా ప్రశంసించబడింది. చాలా మంది ఉల్లంఘించినవారు భావోద్వేగానికి లోనయ్యారు.. అంతేకాకుండా.. ప్రతిజ్ఞను తీవ్రంగా తీసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మహిళా అధికారులు ఆలోచనాత్మకంగా మరియు సమర్థవంతమైన చొరవను అభినందించారు.