సీఎం ఎవరనేది నేడు నిర్ణయిస్తాం: ఖర్గే
తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖర్గే సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ సీఎం ఎవరనేది నేడు నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రానికి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం అని తెలిపారు.
తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు:
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. మాజీ సీఎం చంద్రబాబు జైల్లో ఉండగానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. ప్రస్తుతం బాబు బెయిల్‌పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని పేర్కొంది.
ఎవరి పేరు ప్రకటించినా ఓకే: ఉత్తమ్
తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించినా తనకు ఓకే అని ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక సహా మంత్రివర్గ కూర్పుపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో.. డీకేతో ఉత్తమ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
వేలాది ఎకరాల్లో పంట నష్టం:
బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా కృష్ణా జిల్లా దివిసీమలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితో పాటు ఇతర పంటలు పూర్తిగా నీట మునిగాయి. బస్తాల్లోని ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ జిల్లా కలసపాడు మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, పసుపు, మినుము, ఉలవ పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. కోట్లలో పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం:
తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోని మియాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు అన్ని జలమయమయ్యాయి. రోడ్డుపైకి వరదనీరు భారీగా చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
తేరుకున్న చెన్నై:
మిచౌంగ్ తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మంగళవారం ఉదయం నుంచి నగరంలోని చాలా చోట్ల వర్షం లేకపోవడంతో.. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉదృతి కాస్త తగ్గింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కర్ణాటకలో విషాదం:
కర్ణాటకలో విషాదం వెలుగు చూసింది. బ్రతుకు దెరువుకు బీహార్ నుండి కర్ణాటకకు వలస వచ్చిన కార్మికులు మృత్యువాత పడ్డారు. వివరాల లోకి వెళ్తే.. కర్ణాటక లోని విజయపుర లోని రాజ్‌గురు ఇండస్ట్రీస్ లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో విషాదం వెలుగు చూసింది. సోమవారం రాత్రి గోదాములో స్టోరేజీ యూనిట్ కూలిపోయింది. దీనితో ఆ సమయంలో కార్మికులు కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కార్మికులు మొక్కజొన్న బస్తాల కింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో బస్తాల కింద చిక్కుకున్న కార్మికులలో ముగ్గురిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
దినేష్ ఫడ్నిస్ కన్నుమూత:
ఇటు తెలుగు అటు హిందీ పాపులర్ క్రైమ్ షో ‘సిఐడి’లో సిఐడి అధికారి ఫ్రెడరిక్స్ పాత్రను పోషించిన దినేష్ ఫడ్నిస్ కన్నుమూశారు. కందివాలిలోని తుంగా ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి 12.08 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 57 ఏళ్లు. దినేష్ ఫడ్నిస్ బహుళ అవయవ వైఫల్యం కారణంగా మరణించాడు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఫడ్నిస్‌కి చాలా సన్నిహిత మిత్రుడు. దినేష్ కాలేయం, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నాడు. రోజురోజుకు అతడి ఆరోగ్యం క్షీణించడంతో దినేష్ ఫడ్నిస్ నవంబర్ 30నాడు కండివాలిలోని తుంగా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అప్పటి నుంచి వైద్యులు అతడిని వెంటిలేటర్‌పై ఉంచారు.