రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి:
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వీరు ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంచంద్రబాబుకు వివరించారు. మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
9కి చేరిన మృతుల సంఖ్య:
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో ఐదు మంది మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నేడు తొమ్మిది మంది మృతదేహాలకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతులు అందరూ రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట ఎస్టీ కాలనీ చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
పిచ్చి బాగా ముదిరిందిరోయ్:
పబ్లిక్ ప్లేసులను కూడా ప్రైవేట్ ప్లేసులుగా ఫీలవుతున్నారు కొందరు ప్రేమికులు. ఎక్కడ ఉన్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న సంగతి మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రేమ జంట వెకిలి చేష్టలకు పాల్పడింది. రిల్స్ కోసం రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ వీడియో తీసుకుంది ప్రేమ జంట. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని వేగంగా దూసుకెళ్లాడు ప్రియుడు. బైక్ పైనే ప్రియుడిని హగ్ చేసుకుని ప్రియురాలు కూర్చుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఈ తతాంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది.
బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం:
తెలుగువారి గర్వకారణమైన చారిత్రక సంగీత వాద్యం బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాను ప్రతినిధ్యం వహించే ఉత్పత్తిగా బొబ్బిలి వీణను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ODOP అవార్డును జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జూలై 15న న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపం వేదికపై నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు.
రాధిక హత్యపై రెండో వీడియో విడుదల:
రాధిక యాదవ్.. టెన్నిస్ క్రీడాకారిణి. కన్న తండ్రి అత్యంత దారుణంగా చంపేశాడు. ఇంట్లోనే తుపాకీతో కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య సమయంలో రక్తసంబంధులందరూ ఇంట్లోనే ఉన్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరికి రాధిక మామ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే రాధిక యాదవ బెస్ట్ ఫ్రెండ్ హిమాన్షిక సింగ్ పుజ్‌పుత్ కీలక విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. మొదటి వీడియోలో తల్లిదండ్రులు విధించిన ఆంక్షలు, కట్టుబాట్లు గురించి వివరించగా.. రెండో వీడియోలో మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చింది. హత్యకు ముందు రాధిక తీవ్ర మానసిక క్షోభను ఎదుర్కొందని చెప్పింది. ఇంట్లో పూర్తిగా ప్రశాంతతను కోల్పోయిందని ఆరోపించింది. చివరికి ఇంట్లో పెట్టే ఆంక్షలకు రాధిక తలొగ్గిందని.. నిబంధనల ప్రకారం జీవించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు రాధిక తన తండ్రికి చెప్పిందని వివరించింది. అయినప్పటికీ.. రాధికను చంపేయాలని తండ్రి ముందే నిర్ణయించుకోవడంతో చంపేసినట్లు వివరించింది. రాధిక చాలా మంచి అమ్మాయి అని.. తండ్రి మతిస్థిమితం లేనివాడని.. ముఖంలో ఎటువంటి భావాలు లేవని హిమాన్షిక చెప్పుకొచ్చింది.
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ మృతదేహం లభ్యం:
ఆరు రోజుల క్రితం తప్పిపోయిన త్రిపురకు చెందిన చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ మృతదేహం లభ్యమైంది. 19 ఏళ్ల ఆమె డెడ్‌బాడీని దేశ రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ కింద పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్నేహ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ జూలై 7న అదృశ్యమైంది. ఆమె స్వస్థలం త్రిపుర. ఢిల్లీకి వచ్చి చదువుకుంటోంది. మాజీ సైనికుడు, సుబేదార్ మేజర్ (గౌరవ లెఫ్టినెంట్) ప్రీతిష్ దేబ్నాథ్ (రిటైర్డ్) కుమార్తె. ప్రస్తుతం ఆమె మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతోంది. డయాలసిస్ చేయించుకుంటోంది. స్నేహ తప్పిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆమె జాడ కోసం వెతికారు. 48 గంటల తర్వాత బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు.
లండన్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం:
లండన్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోయింది. దీంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ప్రమాదం తర్వాత విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు నాలుగు విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ వైట్‌సైట్ పేర్కొంది. అయితే విమానంలో ఎంత మంది ఉన్నారు? వారి పరిస్థితి ఏంటి? అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. లండన్‌లోని సౌథెండ్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం చిన్న విమానం కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక, అంబులెన్స్ బృందాలు సహా అత్యవసర సేవలు హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇక విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మౌనం వీడిన కాష్ పటేల్:
ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై దర్యాప్తును ముగించాలని న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయంపై అంతర్గత ఉద్రిక్తతల నేపథ్యంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ రాజీనామా చేయబోతున్నట్లు పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే రాజీనామా వార్తలపై మిండెన్‌లో జరిగిన ర్యాలీలో కాష్ పటేల్ మౌనం వీడారు. రాజీనామా వార్తలను ఆయన తోసిపుచ్చారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో కొత్త విషయాలు ఏమీలేవని న్యాయశాఖ తేల్చింది. ఈ నేపథ్యంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. కుట్ర సిద్ధాంతాలు నిజం కావని.. ఎప్పుడూ నిజం కావని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి సేవ చేయడం గౌరవంగా ఉందని.. ట్రంప్ పిలిచేంత వరకు ఆ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు.
మొదటి గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం:
లార్డ్స్ టెస్ట్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇంగ్లండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తొలి గంటలోనే ఆరు వికెట్లు తీస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘పిచ్ నుంచి బౌన్స్ ఎక్కువగా వస్తోంది. పెవిలియన్ ఎండ్ కంటే నర్సరీ ఎండ్ నుంచి బౌలర్లకు అదనంగా సాయం లభిస్తోంది. చివరి రోజు ఉదయం కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాము. స్టంప్స్ లక్ష్యంగా బంతులు వేస్తాం. తొలి గంటలోనే భారత్ ఆరు వికెట్లు తీయాలని మా బౌలర్లకు చెప్పా. మా బౌలర్లపై నమ్మకం ఉంది. మొదటి గంటలోనే ఆరు వికెట్స్ తీసే అవకాశాలు లేకపోలేదు’ అని ట్రెస్కోథిక్ ధీమా వ్యక్తం చేశాడు.
జానిక్ సిన్నర్ నయా హిస్టరీ:
ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ ఆదివారం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్ ఆటగాడిగా సిన్నర్ నిలిచాడు. దీంతో గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓటమికి సిన్నర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. సిన్నర్ కెరీర్ లో ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్. 23 ఏళ్ల సిన్నర్ సాధించిన ఈ విజయం అతనికి మాత్రమే కాదు, మొత్తం ఇటాలియన్ టెన్నిస్ చరిత్రకే చిరస్మరణీయం. అత్యంత ప్రతిష్టాత్మకమైన లాన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా అతను తన దేశాన్ని గర్వపడేలా చేశాడు. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండటమే కాకుండా, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన ఇద్దరు ఆటగాళ్ళు వింబుల్డన్ పురుషుల ఫైనల్‌లో ఒకరినొకరు ఎదుర్కొనడం ఇదే మొదటిసారి.
సీక్వెల్స్ ను కూడా రీమేక్ చేస్తున్న బాలీవుడ్:
ఓ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాలనుమరో ఇండస్ట్రీలో రీమేక్ చేయడం కామన్. ఆ సినిమాలు హిట్ అయితే వాటి సీక్వెల్స్ విషయంలో కూడా రీమేక్స్ చేస్తుంది బాలీవుడ్. అందుకు ఎగ్జాంపుల్స్ బాఘీ, దడక్ సీక్వెల్స్ చిత్రాలు. ప్రభాస్ వర్షం సినిమాను బాఘీ పేరుతో రీమేక్ చేశాడు టైగర్ ష్రాఫ్. తెలుగులో హిట్టైన క్షణం చిత్రాన్ని బాఘీ2గా, తమిళ సినిమా వెట్టైని బాఘీ3గా ప్రేక్షకులకు అందించాడు. పేరుకు సీక్వెల్లే కానీ ఫస్ట్ కథకు.. సెకండ్ కథకు అసలు సంబంధమే ఉండదు. రాబోయే బాఘీ4 స్టోరీ కూడా సౌత్ మూలాలుండే ఛాన్స్ ఉంది. ఎందుకుంటే ఆ ప్రాజెక్టును డీల్ చేస్తోంది ఓ కన్నడ దర్శకుడు. సో పక్కా మరో సదరన్ స్టోరీతో టైగర్ ష్రాఫ్ గట్టెక్కాలని చూస్తున్నట్లే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దడక్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. 2016లో మరాఠిలో సూపర్ డూపర్ హిట్టైన సైరత్‌ను హిందీలో దడక్ పేరుతో రీమేడ్ చేశారు. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల కొల్లగొట్టింది జాను పాప. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. కానీ పూర్తిగా కొత్త కథ, కథనాలతో, న్యూ ఫెసెస్‌తో దడక్ 2 తీసుకు వస్తున్నారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హానర్ కిల్లింగ్ నేపథ్యంలో దడక్ రాగా.. సామాజిక అసమానతలు ఉన్న అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథగా రాబోతుంది దడక్2. ఇందులో సిద్దాంత్ చతుర్వేదీ, త్రిప్తి దిమ్రీ హీరోహీరోయిన్లు. కాగా, ఈ సినిమా కూడా 2018లో వచ్చిన తమిళ మూవీ పరియేరుమ్, పెరుమాళ్ రీమేక్‌గా రాబోతుంది. సీక్వెల్ విషయాల్లో కూడా సౌత్ స్టోరీలనే బేస్ చేసుకుంటోంది బాలీవుడ్.
సెన్సార్‌పై శ్రీయ బోల్డ్ కౌంటర్:
తాజాగా వరల్డ్ వైడ్ గా ‘సూపర్ మాన్’ మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఇండియా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో విడుదల కాగా, ఇండియా వెర్షన్‌కి సంబంధించి హీరో హీరోయిన్ పై తెరకెక్కిన ముప్పై మూడు సెకన్ల నిడివి ఉన్న ముద్దు సిన్స్ సెన్సార్ వాళ్ళు తొలగించడం జరిగింది. ఈ విషయం పై శ్రీయ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తు ‘ముద్దు సన్నివేశాన్ని తొలగించడం నిజంగా ఆశ్చర్యకరం. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు పూర్తి అనుభూతి ఇవ్వాలని మనం ఆశిస్తాం. కానీ, ఇలాంటి సన్నివేశాలు తీసేస్తే అనుభవం అసంపూర్ణంగా ఉంటుంది. మా డబ్బు ,మా సమయంతో మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. ప్రేక్షకుల్ని చిన్నపిల్లలాగా సెన్సార్ వాళ్ళు భావిస్తున్నారు’ అంటూ సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు శ్రీయ.
వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్:
విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఓపెన్ గ్రౌండ్స్ లో ఈవెంట్స్ నిర్వహించేందుకు అనుమతి లేదు. అందుకే ఆంధ్రలో ఈవెంట్ చేయాలనీ మొద విజయవాడలో నిర్వహించాలని భావించారు. కానీ అక్కడ కుదరడం లేదని సమాచారం. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైజాగ్ లో నిర్వహించాహాలని ఆలోచనలు చేస్తున్నారట. అలా కుదరని పక్షంలో హైదరాబాద్ లో ఇండోర్ వేదికగా నిర్వహించాలని ఆలోచనలు ఉన్నాయి. ఆల్మోస్ట్ వైజాగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని యూనిట్ టాక్. ఏదైనా పవన్ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఎక్కడనేది తెలుస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.