*టెట్ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 27 నుండి వచ్చే నెల 10 వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మే 20 నుండి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. కొద్దిసేపటి క్రితమే.. టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మెగా డీఎస్సీ (TS DSC 2024) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మరోవైపు.. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. కాగా.. తెలంణలో హైదరాబాద్‌లో 878 అత్యధిక ఖాళీలు ఉండగా.. నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిని భర్తీ చేయనున్నారు.
*గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..
గ్రూప్-1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. మరో రెండురోజుల పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు గురువారం చివరి రోజు కాగా.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా.. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 5గంటలకు గడువు ముగియడంతో.. మరో రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఆన్‌లైన్ https://www.tspsc.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న జరుగనుంది.
*మరో రెండు ఎంపీ స్థానాలు ప్రకటించిన బీఆర్ఎస్..
పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ఇద్దరు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా 11కి చేరింది. ఇంకా 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్‌ఎస్.. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది. అటు.. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు అవకాశం ఇచ్చారు.
*మహిళా దినోత్సవం పురస్కారాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 19 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. తానిపర్తి చికిత (ఆటలు), కుడుముల లోకేశ్వరి (ఆటలు), ముక్తేవి భారతి (సాహితి), దివనపల్లి వీణా వాణి, ఎస్ జబీన్ (లిటరేచర్-ఉర్దు), బండ సరోజన (ఎడ్యూకేషన్-కరికులం), బిన కేశవరావు (హ్యాండి క్రాఫ్ట్), గుర్రాల సరోజ (సోషల్ సర్వీస్), జమీల నిషత్ (సోషల్ సర్వీస్), అరిపిన జయలక్ష్మి (స్పెషల్ కేటగిరి), దయ్యాల భాగ్య (డాన్స్-ఫిజికల్ ఛాలెంజ్), ప్రొఫెసర్ అరుణ భిక్షు (కూచిపుడి నృత్యం) అవార్డులకు ఎంపిక చేసింది. అలాగే.. సునీల ప్రకాశ్ (పేరిణి నృత్యం), బండి రాములమ్మ (బోనాల కోలాటం), గొరిగె నీల (బోనాల కోలాటం), మట్టది సరవ్వ (డప్పు కళాకారిణి), సీహెచ్ పుష్ప (ఏకచక్రపురం రైతు), లుఖ్మా కమ్యూనిటీ (సఫా ఎన్‌జీవో), శక్తి టీమ్ (దక్షిణ మధ్య రైల్వే వుమెన్ ఆర్‌పీఎఫ్) కు అవార్డులను ఎంపిక చేసింది.
*మమతకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రిని హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యాలను ఆ ఫొటోలో కనిపించాయి. మమత ఇంట్లో గాయపడ్డారని తెలుస్తోంది. వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మా చైర్‌పర్సన్ మమతా బెనర్జీకి పెద్ద గాయమైందని.. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఎంసీ ఎక్స్‌లో పేర్కొంది. మమతకు జరిగిన ప్రమాదంపై ఆయా రాజకీయ పార్టీలు వాకబు చేస్తున్నాయి. మమత ఇండియా కూటమిలో ఉన్నారు. దీంతో కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఏం జరిగిందో ఆ పార్టీ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
*బెంగళూరు నీటి సమస్యపై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..!
గత కొద్ది రోజులుగా నీటి సంక్షోభంతో బెంగళూరు వాసులు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనేందుకు కూడా చాలా చోట్ల నీళ్లు లభించక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నీటి లభ్యతపై తాజాగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు. రాజధాని నగరం బెంగళూరులో నీటి సంక్షోభం లేదని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. బెంగళూరు ఎలాంటి నీటి ఎద్దడి లేదని పేర్కొన్నారు. సుమారు 7 వేల బోర్లు ఎండిపోయాయని చెప్పారు. అయితే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. నీటి వనరులను గుర్తించామని.. ట్యాంకర్లతో నీరు సరఫరా జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. గతంలో డీకే.శివకుమార్ మరోలా స్పందించారు. తన నివాసంలో కూడా బోరు ఎండిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్భిక్ష పరిస్థితిని గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదన్నారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. బెంగళూరులో నీటి కొరతను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోని బీజేపీ కూడా కారణమేనంటూ గతంలో ఆయన ఆరోపించారు. నగరంలో మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే నగరంలోని వాటర్ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలను శుభ్రం చేసేందుకు, వినోదాలకు నీటిని వృథా చేసిన వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఇప్పటికే స్థానిక యంత్రాంగం హెచ్చరించింది.
*ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ
సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం బట్టబయలు చేసింది. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైట్ https://www.eci.gov.in/లో వివరాలను ఉంచింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది. పార్ట్-1లో ఎన్నికల బాండ్లు ఎవరైతే కొనుగోలు చేశారోవారి వివరాలు పొందుపరిచారు. పార్ట్-2లో ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను పొందుపరిచారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ డేటా వివరాలను ఎస్‌బీఐ ఈసీకి అందజేసింది. డేటా అందుకున్న ఎన్నికల సంఘం.. గురువారం ఆ వివరాలు ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. రెండు పార్టులుగా వివరాలు తెలియజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) పంచుకున్న ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది . ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు దాతలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేవారిలో అపోలో టైర్స్, లక్ష్మీ మిట్టల్, ఎడెల్వీస్, పివిఆర్, కెవెంటర్, సులా వైన్, వెల్స్పన్, సన్ ఫార్మా ఉన్నాయి. రాజకీయ నిధుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా సమగ్ర సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌తో పంచుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఎస్‌బీఐని ఆదేశించింది. కొనుగోలుదారుల వివరాలతో పాటు, ఎలక్టోరల్ బాండ్ల ఎన్‌క్యాష్‌మెంట్ తేదీ మరియు విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎస్‌బీఐ ఈసీకి అందించింది. ఈ చర్య రాజకీయ విరాళాల పారదర్శకతను పెంపొందించడం, నిధులు గుర్తించదగినవి మరియు ఖాతాలో ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.