ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లారు.
మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం:
నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మహానంది క్షేత్రానికి 6 కిమీల సమీపంలోని క్రిష్ణనంది క్షేత్రం వద్ద చిరుత సంచరిస్తోంది. చిరుతను చూసి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఓ గంట తర్వాత మహానంది క్షేత్రంలోని పెద్ద నంది వద్ద చిరుత కనిపించింది. రెండు ఒకటేనా లేదా వేరువేరా అని స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లలో రికార్డ్ అయ్యాయి. చిరుతపులి సంచారంతో మహానందికి వచ్చిన భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత కదలికలను యువకులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అటవీ అధికారులు కృష్ణ నందికి వెళ్లి చిరుత పాదముద్రలు సేకరించారు. చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఢిల్లీలో రేవంత్ రెడ్డి:
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నట్లు సమాచారం. అయితే ప్రధానితోనే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న తరుణంలో తెలంగాణ సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించాలని సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కోరారు. తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సీఎం.. ఇక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడమే మిగిలిందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి బయల్దేరారు.
నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్:
నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలల బంద్ చేయాలని కోరుతూ.. ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్‌వో, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ, తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఎన్టీఏ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్‌లో ప్రధాని మోడీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
జూలై 7న సీఎంగా హేమంత్ ప్రమాణ స్వీకారం:
జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ జూలై 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హేమంత్ సోరెన్ తన కేబినెట్‌లో కొత్త వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. బుధవారం చంపై సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించి.. తాత్కాలిక ముఖ్యమంత్రిగా పని చేయాలని కోరారు. మరోవైపు హేమంత్ సోరెన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బుధవారం జేఎంఎం నేతృత్వంలోని కూటమి నేతలు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
లోక్ సభలో కొత్త రూల్స్:
ఇప్పుడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పార్లమెంటు సభ్యులెవరూ నినాదాలు చేయలేరు. 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో కొందరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ‘జై పాలస్తీనా’, ‘జై హిందూ రాష్ట్ర’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ స్పీకర్ నిబంధనలలో కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సభ్యులు ప్రమాణం తప్ప మరే ఇతర పదం లేదా వ్యక్తీకరణను ఉపయోగించకూడదని నిర్ణయించారు.
భారత్ చేరుకున్న టీమిండియా:
టీ20 ప్రపంచకప్ 2024 సాధించి విశ్వవేదికపై భారత పతాకాన్ని ఎగురవేసిన టీమిండియా.. సగర్వంగా భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు దేశ రాజధాని ఢిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అభిమానులకు చూపించాడు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో భారత జట్టు సమావేశం అవుతుంది. ప్రధానితో సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలోనే జట్టు ముంబైకి బయల్దేరుతుంది.
పిఠాపురంలో స్థలం కొన్న పవన్:
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం (జూన్ 3) స్థలం కొని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలను కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని.. పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని పవన్ భారీ బహిరంగ సభలో చెప్పారు.
ఇద్దరు భామలతో బాలయ్య:
నటి వరలక్ష్మి శరత్ కుమార్ వెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన పలువురు తారలు పాల్గొన్నారు. అయితే సీనియర్ నటి కుష్బూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటిమణులు శోభన, కుష్బూలతో నందమూరి బాలకృష్ణ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో బాలయ్యబాబు ఎంతో హుషారుగా కనిపించారు. ప్రస్తుతం బాలకృష్ణ 109వ సినిమాగా బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.