మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతి:
లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. నాగాంజలి మృతదేహాన్ని కిమ్స్ హాస్పిటల్ నుండి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మరికొద్ది సేపట్లో నాగాంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం నాగాంజలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించనున్నారు.
ఆస్పత్రికి డెలివరీకి వెళ్లిన గర్భిణి అదృశ్యం:
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణి డెలివరీ కోసం రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది. రాత్రి ఎవరికీ చెప్పకుండా ఆమె హాస్పిటల్ నుండి బయటికి వచ్చి.. హైటెక్ బస్టాండ్ వద్ద కాకినాడ నాన్ స్టాప్ బస్సు ఎక్కి వెళ్లిపోయింది. అనంతరం కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్‌కు సంధ్యారాణి చేరింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి మొత్తం వెతికినా.. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆందోళన చెందిన వారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంధ్యారాణి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కాకినాడ వెళ్లినట్లు పోలీసులు కనుగొన్నారు. డెలివరీ కోసం వెళ్లి కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
ఏపీ సచివాలయంలోని అగ్నిప్రమాదం:
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.
బీర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం:
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు:
సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేకువజామున పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పూజల కోసం ఉదయం ఐదు గంటల సమయంలో పాఠశాల గేటు తెరిచి ఉంచిన రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం, బలిపూజ కోసం ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడిన వెంటనే వెంకటేశం అక్కడి నుంచి పరారయ్యాడు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం:
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు మురుగు నీటితో నిండాయి. పలు బస్తీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లు చెరువులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో వర్షం విరుచుకుపడటంతో జన జీవనం స్తంభించింది.
వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు:
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇది కీలక పరిణామం అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్నారు. తాజాగా బిల్లు ఆమోదంతో అట్టడుగున ఉన్న వర్గాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. అంతేకాకుండా వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని చెప్పుకొచ్చారు. ‘‘పార్లమెంట్ ఉభయ సభలు వక్ఫ్ (సవరణ) బిల్లు మరియు ముస్సల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును ఆమోదించడం కీలక పరిణామం. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం సమిష్టి అన్వేషణలో ఒక కీలకమైన ఘట్టం. ముఖ్యంగా చాలా కాలంగా అట్టడుగున ఉన్న ప్రజలకు ఎంతగానో సహాయపడుతుంది.’’ అని మోడీ ట్వీ్ట్ చేశారు.
రాజ్యసభలోనూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం:
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మొత్తానికి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి వంతు వచ్చింది. ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. చట్టం అమల్లోకి రానుంది. ఇక రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై అర్ధరాత్రి వరకు వాడీవేడీగా చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లోపాలు ఎత్తిచూపాయి. మొత్తానికి ఉభయ సభల్లో సులువుగానే బిల్లు ఆమోదం పొందడం విశేషం.
ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్:
లండన్ నుంచి ముంబయికి బయలుదేరిన ఒక విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో టర్కీలోని దియార్‌బకిర్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి నుంచి 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులు చిక్కుకుపోయారు. వర్జిన్ అట్లాంటిక్ విమానం లండన్ నుండి ముంబయి ప్రయాణానికి బయలుదేరింది. అయితే, సాంకేతిక సమస్య కారణంగా, దియార్ బకిర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్టార్ హీరో రేంజ్ కు సిద్ధు:
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. గురువారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ ‘బీవీఎస్ఎన్ ప్రసాద్ తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. బాపీ నాకు మంచి స్నేహితుడు. ఒకసారి జాక్ పాయింట్ ఆయనకు చెప్పాను. వెంటనే సిద్దుతో మీటింగ్ జరగడం, ఒక్కరోజులోనే ప్రాజెక్ట్ సెట్ అవ్వడం జరిగింది. సిద్దు లాంటి నటుడితో పని చేయడం ఏ దర్శకుడికైనా చాలా సులభం. సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు. ఆ సీన్ అద్భుతంగా వస్తుంది. రైటింగ్ స్టేజ్ నుంచే సిద్దు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. జాక్ థీమ్ మాత్రమే నేను రాశాను. జాక్ కారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్‌లో సిద్దుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. సిద్దు చాలా ఇంప్రవైజ్ చేశాడు. జాక్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిలోనూ జాక్ ఉంటాడు. ఆ జాక్ ఎవరు? అనేది ఎవరిది వాళ్లే తెలుసుకోవాలి. ఈ సినిమా నా స్టైల్లోనే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ను నమ్మి వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను నేను నిరాశ పరచను. పైన సిద్దు ఫ్లేవర్ కనిపించినా లోలోపల నా స్టైల్లో ఉండే ఎమోషన్, మెసెజ్ అన్నీ ఉంటాయి. వైష్ణవి చైతన్య కళ్లతోనే నటించేశారు. ఆమె చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. చాలా మంచి నటి. ఆరెంజ్ నుండి ఇప్పుడు జాక్ ఈ గ్యాప్ లో సిద్దు స్టార్ హీరోగా ఎదిగినందుకు నాకు చాల సంతోషంగా ఉంది’ అని అన్నారు.
జాక్.. చేస్తాడు మనసుల్ని హ్యాక్:
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి గురువారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. ‘బొమ్మరిల్లు భాస్కర్ జాక్ కథను చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది చాలా పెద్ద కథ. పైకి కనిపించేది కాదు.. లోపల చాలా ఉంటుంది. భాస్కర్ చేసే రెగ్యులర్ జానర్ కాకుండా కొత్త జానర్ లో ఈ సినిమా ఉంటుంది. టిల్లు, టిల్లు స్క్వేర్ కారెక్టరైజేషన్ ఏ మీటర్‌లో ఉంటుందో.. జాక్ అంతకు మించి ఉంటుంది. టిల్లు అనేది కారెక్టరే బేస్డ్ సినిమా అయితే.. జాక్‌లో కారెక్టర్‌తో పాటు అదిరిపోయే కథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ఛార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. జాక్ ఐడియానే అద్భుతంగా ఉంటుంది. ఆ ఐడియా నుంచి వచ్చిన సీక్వెన్స్ ఇంకా బాగుంటాయి. భాస్కర్ ఈ సినిమా కోసం దగ్గరదగ్గరగా రెండేళ్లు పని చేశారు. రొటీన్ యాక్షన్ సినిమాలా ఉండదు. చాలా రేసీగా ఉంటుంది. జాక్ అనేది నిజంగానే క్రాక్ లాంటి పాత్ర. చాలా ట్విస్టులు ఉంటాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. జాక్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న రాబోతోంది. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
హ్యాట్రిక్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో ఐపీఎల్ 2025లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 80 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 201 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (33; 21 బంతుల్లో 2×4, 2×6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లు వైభవ్ అరోరా (3/29), వరుణ్ చక్రవర్తి (3/22) చెలరేగారు.