రాజ్యసభకు నాగబాబుకు:
సినీ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు.. రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అని సమాచారం.
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన:
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. గురువారం ఉదయం తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అనంతరం రెండు రోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ.. తమిళనాడు, శ్రీలంక తీరాలను తాకుతుందని ఐఎండీ పేర్కొంది. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్టై, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుపానుకు ‘ఫెన్‌గల్’గా నామకరణం చేశారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం:
జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. రియాక్టర్ పేలుడుతో పారిశ్రామిక వాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మహారాష్ట్ర సీఎం ఎంపికపై నేడు కీలక భేటీ:
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోడవం దాదాపు ఫిక్స్ అయింది. నేడు (నవంబర్ 28) ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేశారు.
ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం:
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని ఆమె అందుకున్నారు. ఇక, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవాన్ గెలుపొందారు. కేవలం 1,457 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈరోజు (నవంబర్ 28) లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా సమీక్షంలో ప్రియాంక గాంధీ, వసంతరావు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో తొలిసారి ప్రియాంక పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు.
హేమంత్ సోరేన్ ప్రమాణస్వీకారం:
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు (NOV 28) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, ఎన్‌డీఏ 24 సీట్లు దక్కించుకున్నాయి. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ సైతం గెలిచింది. ఆదివారం నాడు హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
పాకిస్తాన్లో హైటెన్షన్:
పాకిస్తాన్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నిర్ణయించేందుకు వర్చువల్ సమావేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటుకు ఒక రోజు ముందు ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తే.. భద్రతాపరమైన సమస్యలు వస్తాయని పలు దేశాల బోర్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈవెంట్‌ను పాకిస్తాన్ నుంచి తరలించే ఛాన్స్ ఉంది. ఇక, PCB దీనిని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అంగీకరించే అవకాశం కూడా ఉంది.
ఐశ్వర్య–ధనుష్ లకు విడాకులు మంజూరు:
తమిళ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నాం అని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. కానీ ఇటీవల ఈ జంట మరలా ఒకటవ్వబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేసాయి. అవేవి వస్తావం కాదని విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు. ఐశ్వర్య, ధనుష్ నవంబర్ 21 న చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. అక్కడ వారు విడిపోవాలనే కోరుకుంటున్నట్టు న్యాయస్థానం ముందు వ్యక్తం చేశారు. విడాకుల కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి విచారణను నవంబర్ 27కి వాయిదా వేశారు. నేడు వీరి కేసులో తుది తీర్పు వెల్లడిస్తూ వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. ధనుష్, ఐశ్వర్య 2004లో చెన్నైలో పెళ్లి చేసుకున్నారు.