పెనమలూరులో సీఎం పర్యటన:
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడలోని పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనుండగా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. సీఎం పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
మళ్లీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు:
‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. డిసెంబర్ 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి మోహన్ బాబు చేరుకున్నారు. బుధవారం (డిసెంబర్ 18) సాయంత్రం శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. కలెక్షన్ కింగ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్‌ను భారత ఏఐ రాజధానిగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం మెగా ప్లాన్ గా సీఎం తెలిపారు. దీనిని సాధించడానికి 200 ఎకరాల విస్తీర్ణంలో AI సిటీని రూపొందించాలని యోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లకు AI సిటీ కేంద్రంగా ఉండబోతుంది. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న తొలి ఏఐ సిటీలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఆఫీస్ స్పేస్‌ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ప్రతిపాదించింది.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు:
ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమావేశాలు రద్దయ్యాయి. “భూ భారతి” బిల్లుపై నేరుగా చర్చ జరుగుతుంది. రైతు భరోసా విధివిధానాలపై కూడా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో రైతు భరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా.. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు ఇప్పటికే శాసనసభ ఆమోదం తెలిపింది. హైడ్రామాకు అధికారాలు కల్పిస్తూ తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏ మాత్రం ఆలోచించకుండా అనేక కట్టడాలను కూల్చివేసి పేదలు భయపడే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించారు. చెరువులు, చెరువుల దగ్గర లక్షలాది పేదల ఇళ్లు ఉన్నాయని అందరికీ భరోసా ఇవ్వాలని కోరారు.
బంక్ వద్ద అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి:
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లోని భంక్రోటా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌లో ఈ రోజు (డిసెంబర్ 20) ఉదయం భారీ అగ్ని ప్రమాద చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సీఎన్‌జీ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం నెలకొంది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాప్తి చెండదంతో పలు వాహనాలు మంటల్లో కాలిబుడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరో 12 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి 22 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి.
గేదె యాజమానిని తేల్చేందుకు డీఎన్‌ఏ టెస్టు:
కర్ణాటకలోని దేవనగరి జిల్లాలో గేదె యాజమాన్యాన్ని తేల్చడానికి డీఎన్‌ఏ పరీక్ష వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే, గేదె ఓ దేవాలయానికి చెందినది. వందలాది మంది ప్రజలు గేదెను పూజిస్తారు. అయితే, ఈ గేదె యజమాని ఎవరనే విషయంపై కునిబేలకర్ గ్రామం, కులగట్టే గ్రామం మధ్య తీవ్ర వివాదం నెలకొంది. కునిబేలకర్ గ్రామంలోని కరియమ్మ దేవి వద్ద ఈ గేదె ఎనిమిదేళ్లుగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు కులగట్టే గ్రామ ప్రజలు, ఈ గేదె తమ గ్రామానికి చెందినదని, రెండు నెలల క్రితం తప్పిపోయిందని అంటున్నారు. రెండు గ్రామాల ప్రజలు గేదెపై గొడవ కారణంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన:
అధికార మార్పిడికి రెడీ అవుతున్న సమయంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడింది. క్రిస్మస్ పండగ సమయంలో షట్‌డౌన్ ముప్పును తప్పించేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ తిరస్కరించారు. దీనిపై చర్చ జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్, రిపబ్లికన్ చట్ట సభ్యులకు అతడు కోరాడు. ఫెడరల్ ప్రభుత్వం దగ్గర నిధులు తరిగిపోతున్న సమయంలో.. ఈ ప్రణాళిక తీసుకు రావడం వల్ల కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే, బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధుల ప్రణాళికలో ఖర్చులు భారీగా పెరిగిపోయాయని ఎలాన్ మాస్క్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అయితే, ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాస్క్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ:
గత కొన్ని నెలలుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లను పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడనుంది.