గోశాలకు వెళ్లేందుకు భూమనకు పోలీసుల అనుమతి:
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. టీడీపీ ఛాలెంజ్‌ను భూమన స్వీకరించారు. గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. గోశాలకు వెళ్లేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు పోలీసుల అనుమతి లభించింది. మరికొద్దిసేపట్లో ఆయన గోశాలకు బయల్దేరనున్నారు. ఈరోజు ఉదయం భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ హౌస్ అరెస్టు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. భూమన కరుణాకర్ రెడ్డిని గృహనిర్బంధం చేయలేదని తిరుపతి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు స్పష్టం చేశారు.
ఫ్లైయాష్ లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు:
వైఎస్సార్ జిల్లా చిలమకూరు, ఎర్రగుంట్ల వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలలో కాంట్రాక్ట్ పనులు అన్నీ తమకే ఇవ్వాలంటూ ఫ్లైయాష్ లారీలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను నిలిపేశారు. ఫ్లైయాష్ రవాణా చేయవద్దంటూ సీఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో.. లారీలు నిలిచిపోయాయి. ఐదు రోజులుగా ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో.. చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి ఇప్పటికే పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ముడిసరకు లేకపోవడంతో ఈరోజు నుంచి ఎర్రగుంట్ల ప్లాంట్‌లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ విషయంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్‌లో రెండవ రోజూ ఈడీ సోదాలు:
హైదరాబాద్ నగరంలో రెండవ రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో పెద్దఎత్తున నగదు స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రాథమిక విచారణలో నరేంద్ర సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వీటి ద్వారా అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ షెల్ కంపెనీలకు నిధులు బదలాయింపుతో పాటు, భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు సీఎం:
ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు గల అత్యంత ముఖ్యమైన మార్గంగా విదేశీ పర్యటనలను చేస్తుండడం మరింత జోరుగా మారింది. రాష్ట్రాలకి విదేశీ పెట్టుబడులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటిస్తూ అక్కడి పరిశ్రమలతో, పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్ పర్యటన చేపట్టింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం టోక్యోకు చేరుకుంది. టోక్యో విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ బృందంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య:
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణంగా జరిగింది. కేన్సర్ బాధితుడు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్ నివాసి అయిన కుల్దీప్ త్యాగి.. భార్య నిషు త్యాగిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం కుల్దీప్ త్యాగి కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడని చెప్పారు. బుధవారం ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు:
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంస్కృతిక వేదికలలో జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతారు.
హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్:
హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. తాజాగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)ను కోరినట్లుగా నివేదిక అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఇటీవల వైట్‌హౌస్ ఆరోపించింది. జో బైడెన్ పదవీకాలంలో అమెరికాలోని అనేక యూనివర్సిటీల్లో హమాస్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ అయితే ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ కత్తి కట్టినట్లుగా కనిపిస్తోంది.
ప్రపంచ యాత్రలో మరో ఘట్టానికి చేరుకున్న బాహుబలి:
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప విజువల్ ఎపిక్ మాస్టర్ పీస్ ‘బాహుబలి: ది బిగినింగ్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. 2015లో విడుదలై భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, లాంటి స్టార్ సీనియర్ యాక్టర్స్ కెరీర్‌ను ఈ మూవీ టాలీవుడ్ రూపురేఖలను మార్చేసింది. విజయేంద్ర ప్రసాద్ రచించిన కథకు ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం అందించాడు. అయితే ఈ మూవీ ఇప్పుడు అంతర్జాతీయంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇప్పుడు స్పానిష్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. అలా ‘బాహుబలి’ ప్రపంచ యాత్రలో మరో ఘట్టాన్ని చేరుకుంది. అయితే ఈ మూవీను అంతర్జాతీయ మాధ్యమాల్లో మరింత విస్తృతంగా పరిచయం చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం, గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇది మంచి డెసిషన్ అనుకోవచ్చు. ప్రజంట్ ప్రభాస్ రెజ్ ఏంటో మనకు తెలుసు సో అది కూడా మరింత ప్లేస్ అవ్వనుంది.
శింబు సినిమాలో కమెడియన్ గా సంతానం:
సంతానం హావ తమిళ సినీపరిశ్రమలో పీక్స్ లో ఉన్న టైమ్ లో కమెడియన్ గా సినిమాలు చేయనని ప్రకటించాడు. ఎందరో కమెడియన్స్ లాగా తాను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసి కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. ఆ విధంగా సక్సెస్ కూడా అయ్యాడు. అలాగే డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు సంతానం మరోసారి కమెడియన్ గా నటించబోతున్నాడనే వార్త తమిళ సిని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కోలీవుడ్ యంగ్ హీరో శింబు హీరోగా తన 49వ సినిమా చేస్తున్నాడు. రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంతానం నటిస్తున్నాడు. అయితే అది కమెడియన్ కాదని సెకండ్ హీరో స్థాయిలో ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమాకు సంతానం ఏకంగా రూ. 7 కోట్లు తీసుకోబోతున్నాడట. యంగ్ సెన్సేషన్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరియు కయాడు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
పూజా పాప రియాలిటీకి దగ్గరైందే:
ప్రజంట్ పూజ హెగ్డే కెరీర్ కాస్త గట్టెక్కింది.. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇందులో సూర్య హీరోగా నటిస్తున్న ‘రెట్రో’ మూవీ ఇకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సోషల్‌మీడియా గురించి పూజాహెగ్డే ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.. ‘ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతమాత్రాన వారందరూ టికెట్లు కొని నా సినిమాలు చూస్తారని గ్యారంటీ ఇవ్వలేం కదా.. సోషల్‌మీడియా చాలా భిన్నమైన ప్రపంచం. ఏది నిజమో, ఏది అబద్ధమో నిర్ధారణ చేసుకోలేం. కొంతమంది తారలకు 50లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. కానీ బాక్సాఫీస్ వద్ద వాళ్ల సినిమాలకు మంచి వసూళ్లు లభిస్తాయి. అందుకే వృత్తి పట్ల అంకితభావంతో ఉంటూ, బయట వారి నుంచి సినిమాకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి’ అని పూజా హెగ్డే తెలిపింది. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్‌గా మారాయి.
ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం:
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊహించని ఉత్కంఠను అందించింది. రెండు జట్లు సమానంగా 188 పరుగులు చేసి స్కోరులో టై అయిన వేళ, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇది 2021 తర్వాత ఐపీఎల్‌లో జరిగిన తొలి సూపర్ ఓవర్ కావడం విశేషం. ప్రధాన ఇన్నింగ్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా సమాన రీతిలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దశకు తీసుకెళ్లింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, ఢిల్లీ బౌలింగ్ ఎదుర్కోలేక 6 బంతుల్లో కేవలం 11 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు లక్ష్య ఛేదనలో విశ్వరూపం చూపించారు. కేవలం 4 బంతుల్లోనే 13 పరుగులు చేసి సూపర్ ఓవర్‌లో గెలుపు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ కీలకమైన రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సీజన్‌లో ఇది మొదటి సూపర్ ఓవర్ కావడం, అలాగే మ్యాచ్ అంతా చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగడం అభిమానులకు నచ్చిన అంశాలుగా నిలిచాయి.