నేడు కల్లితండాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్:
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను పరామర్శిస్తారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ 12.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 తిరిగి బెంగళూరుకు చేరుకుంటారు.
సైన్యానికి దైవ బలం కోసం జనసేన పూజలు:
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పిన మన దేశ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజల కోసం జనసేన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఇవాళ దేశ సైన్యం, దేశ నాయకత్వానికి దైవ బలం అండగా ఉండాలని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్నాయి.
నేడే పాలీసెట్ 2025 పరీక్ష:
నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా.. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 పరీక్ష జరుగుతుంది. నేడు (మంగళవారం) రోజున ఉదయం 11.00 గం. నుండి మధ్యాహ్నం 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,716 మంది అభ్యర్థులు 276 పరీక్ష కేంద్రాలలో హాజరవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగానే అనుమతిస్తారు. కాబట్టి, హాజరయ్యే వారు ఉదయం 10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్ష ఉదయం 11.00 గం. ప్రారంభం తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించబడరు.
ఎల్‌ఆర్‍ఎస్ రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం:
LRS Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (LRS)కు సంబంధించిన గడువు పొడిగింపుపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. LRS ఫీజుపై ఇచ్చే 25 శాతం రాయితీని మే 31 వరకు పొడిగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి జీవో జారీ చేశారు. ఇకపోతే, మార్చి నెల నుంచి అమల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం గతంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒకసారి పొడిగించగా.. ఆ గడువును ఆ తర్వాత మళ్లీ మూడు రోజులు అదనంగా పొడిచించారు. తాజాగా, మరో నెల రోజుల పాటు ఈ రాయితీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పలు విమాన సర్వీసులు రద్దు:
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ మరోసారి దాడులకు యత్నిస్తోంది. దీంతో ఉత్తరాదిన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుంచి ఉత్తర, పశ్చిమ భారత్ లోని అనేక నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇది మీ ప్రయాణ ప్రణాళికలకు ఎలా అంతరాయం కలిగిస్తుందో మేము అర్థం చేసుకున్నాము. దీనివల్ల కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాము. అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
దేశభక్తిని చాటుకున్న పేరెంట్స్:
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనే పేరు ప్రజలకు బాగా నచ్చుతోంది. వారు తమ కూతుళ్లకు సింధూర్ అని పేరు పెడుతున్నారు. దేశ భక్తిని చాటుకుంటున్నారు తల్లిదండ్రులు. కుషినగర్ జిల్లాలో, మే 7 తర్వాత ఓ హాస్పిటల్ లో రెండు రోజుల్లో జన్మించిన 17 మంది బాలికలకు వారి తల్లిదండ్రులు సింధూర్ అని పేరు పెట్టారు. దేశంలోని త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం ద్వారా పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం నేర్పాయి.
సెల్‌ఫోన్.. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది:
తాజాగా సెల్ ఫోన్.. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్న ఆ ఇద్దరూ రైలు ఢీకొని మృతి చెందారు. చెన్నైలోని స్థానిక సెయింట్ థామస్ మౌంట్‌లో ఈ ఘటన జరిగింది.పెరంబలూరుకు చెందిన మహమ్మద్ నపూల్ (20), సబీర్ అహ్మద్ (20)లు థామస్ మౌంట్ సమీపంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. థామస్ మౌంట్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఇద్దరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో ఎగ్మూరు నుంచి తాంబరం వైపు వెళ్తున్న సబర్బన్ రైలు దూసుకొచ్చింది. రైలు డ్రైవర్ ఎన్నిసార్లు హారన్ మోగించినా.. స్దానికులు కేకలు వేస్తున్నా యువకులు పట్టించుకోలేదు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలపైకి వచ్చేశారు. ఇద్దరినీ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు యువకుల మృతదేహాలను స్దానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి:
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొని వంతెనపై నుంచి కింద పడిపోయిన ప్రమాదంలో మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తీవ్రగాయాల కారణంగా అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడ్డాడని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
షేక్ హసీనాకు బిగ్ షాక్:
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్‌ను అధికారికంగా నిషేధించింది. రెండు రోజుల క్రితం ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం చట్టం మునుపటి వెర్షన్ ప్రకారం దాని కార్యకలాపాలను నిషేధించింది. దీనికి సంబంధించి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందని హోం సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ (ICT-BD) లో అవామి లీగ్ నాయకులు, కార్యకర్తలపై విచారణ పూర్తయ్యే వరకు అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థలను ఉగ్రవాద నిరోధక చట్టం 2025 కింద నిషేధించినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం రాత్రి తెలిపింది. తొలి మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరు, కోల్‌కతా మధ్య జరుగుతుంది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. మే 29న క్వాలిఫైయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఐపీఎల్ 2025 నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, భద్రతా సంస్థలు, టోర్నీ వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత ఐపీఎల్ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
పూజా కార్యక్రమాలతో ‘మహాకాళి’ షూటింగ్:
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులో ప్రశాంత్ వర్శ ఒకరు. ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్ని తాజాగా తన నూతన చిత్రం ‘మహాకాళి’ ను ప్రారంభించారు. PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) నుంచి వస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇవాళ అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. “విశ్వంలో అత్యంత క్రూరమైన సూపర్ హీరో” అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ‘హను-మాన్’ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. దీంతో ఇక తన సినిమాటిక్ యూనివర్స్‌లో చాలా సినిమాలు ఉండబోతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే వెల్లడించారు. ఇందులో భాగంగా ‘మహాకాళి’ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. పూజా కొల్లూరు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా కథ బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందుతోంది. మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారట. అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికి, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్‌గా నటిస్తాడనే టాక్ మాత్రం వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయక తప్పదు.
‘పెద్ది’ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్:
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్‌ల్లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. భారీ బడ్జెట్‌తో వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇక ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా చరణ్ లుక్ అధిరిపోయింది. అయితే మొదట చరణ్ లుక్ పుష్పలో అల్లు అర్జున్‌లా ఉందని, కేజీఎఫ్‌లో యశ్‌లా ఉందని విమర్శించారు. కానీ శ్రీరామనవమి రోజున విడుదల చేసిన నిమిషం నిడివి ఉన్న గ్లింప్స్ వాటన్నింటినీ పటాపంచలు చేసింది. రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్.. ముఖ్యంగా చివర్లో ఆయన కొట్టిన షాట్ విధానం మెగా ఫ్యాన్స్‌తోనే కాదు న్యూట్రల్ ఆడియన్స్‌తోనూ చప్పట్లు కొట్టించింది. ఈ గ్లింప్స్‌తో ‘పెద్ది’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం లండన్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ‘ ‘పెద్ది’ మూవీ షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది.. ఈ సినిమా ‘రంగస్థలం’ చిత్రానికంటే కూడా బాగుంటుంది’ అని చరణ్ తెలిపారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.