మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు:
మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో నాసిరకం మద్యంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారన్నారు. బెల్టు దుకాణాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నాసిరకమైన 29 మద్యం బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాం అని తెలిపారు. తాగేవాళ్లను ఒక్కసారిగా మార్చలేమని, ఇది క్రమేపీ జరగాల్సిన ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు.
హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట:
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో నాని ఏ6గా ఉన్నారు. ఈ ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బందరు మండలం పోట్లపాలెంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరుతో గోడౌన్స్ నిర్మించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యంను పక్కదారి పట్టించారని నానిపై కేసు నమోదైంది. ఆయన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు
వివాదంలో పటాన్ చెరు ఎమ్మెల్యే:
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అతడిపై పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు క్యాడర్ రెడీ అవుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లు సోషల్ మీడియాలో మహిపాల్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో, పార్టీని తిడుతున్న మహిపాల్ రెడ్డి ఎందుకు పార్టీలోకి వచ్చారని కాంగ్రెస్ క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. అయితే, మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఆ వీడియోని మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు. కాగా, మధ్యాహ్నం 2 గంటలకు అమీన్ పూర్ లోని పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అనంతరం, మధ్యాహ్నం గాంధీ భవన్ వెళ్లి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి నాయకులు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై రాష్ట్రంలోని పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ క్యాడర్.
రేపు పరేడ్ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి మిషన్-2025 విడుదల:
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్త్ కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ – 2025.. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు రానున్నాయి. స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృత పరిచేలా సభ్యుల అర్హత వయసు పెంచనున్నారు. కిశోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయననున్నారు. సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపుతో పాటు గరిష్ట వయసు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంపుదల చేశారు.
నటి కాదు.. పెద్ద కిలాడీ:
రన్యా రావు కన్నడ నటి. పైగా ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె. ఇప్పుడు ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఏదో గొప్ప పని చేసిందనో.. ఘనకార్యం చేసిందనో కాదు. కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా ఉండాల్సిన ఆమె.. నీచానికి ఒడిగట్టింది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే.. ఈమె ఎంత పెద్ద కిలాడీనో అర్థం చేసుకోవచ్చు. మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్‌పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.
స్టాలిన్‌పై అమిత్ షా విసుర్లు:
హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ఎల్‌కేజీ స్టూడెంట్.. పీహెచ్‌డీ హోల్డర్‌కు బోధించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ భాష కోసం ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేసింది ఏమీలేదన్నారు. ప్రాంతీయ భాషలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది ప్రధాని మోడీ ప్రభుత్వమేనన్నారు.
10 మంది భారతీయుల్ని రక్షించిన ఇజ్రాయెల్:
పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. పది మంది భారతీయ నిర్మాణ కార్మికుల పాస్‌పోర్ట్‌లు లాక్ చేయబడ్డాయి. దీంతో వారంతా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్నారు. మొత్తానికి నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వారిని రక్షించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నేతృత్వంలో రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్‌లో కార్మికులను రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ఈ విషయం దర్యాప్తులో ఉందని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కార్మికులకు భద్రత కల్పించాలని ఇజ్రాయెల్ అధికారులను కోరినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఎలోన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ:
అంతరిక్ష ప్రయోగంలో ఎలోన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రయోగించిన కొన్ని నిమిషాలకే స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. దక్షిణ ఫ్లోరిడా-బహామాస్ సమీపంలో రాకెట్ పేలిపోయి శిథిలాలు చెల్లాచెదురుగా కింద పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్సాస్‌లో గురువారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. హఠాత్తుగా అంతరిక్షంలో ఉండగా పేలిపోయింది. అంతే వేగంగా శిథిలాలు కిందకు వచ్చి పడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల మీడియా సమావేశం:
కొద్దీ సేపటి క్రితం సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హోలీ స్టిక్ వైద్యుల మీడియా సమావేశం నిర్వహించారు. కల్పన రికవరీ అవుతున్నారు. ఆమె లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది. ఆమెకు ఇంకా చికిత్స అవసరం.రెండు మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తాం. ఆక్సిజన్ కూడా తీసి వేసాము. ఇప్పడు కల్పన నార్మల్ గానే శ్వాస తీసుకుంటున్నారు. నిన్నటిదాకా లిక్విడ్ ఫుడ్ అందించాం ఇప్పుడు నార్మల్ ఫుడ్ తీసుకుంటుంది. అపాస్మరక స్థితిలో ఉన్నప్పుడు కల్పన హాస్పిటల్కి తీసుకువచ్చారు. వెంటి లేటర్ మీద చికిత్స అందించాము. ఊపిరితిత్తుల్లోకి వాటర్ చేరితే చికిత్స అందించాము. సమయానికి చికిత్స అందించడం వల్ల ఆమె కోలుకోగలిగారు. మానసికంగా ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించాము’ అని వైద్యులు తెలిపారు.
హెచ్‌సీఏ తీరు మారదా?:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇక 27న లక్నోతో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. ఉప్పల్ మైదానంలో జరగనున్న ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్స్ నేడు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఐపీఎల్ టికెట్స్ సేల్ షురూ అయింది. ఫ్యాన్స్ టికెట్ల కోసం indistrict వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. సేల్ షురూ అయ్యాక కొద్ది నిమిషాలకే సైట్లో సోల్డ్ ఔట్ చూపిస్తోంది. కేవలం 10 వేలు, 21 వేల రూపాయల టికెట్లు మాత్రమే బుకింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధర ఉన్న రూ.700 టికెట్లు మొత్తం బ్లాక్ లేదా సోల్డ్ ఔట్ అని చూపిస్తోంది. దాంతో హైదరాబాద్ ఫాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ సీజన్‌లోనూ బ్లాక్ దందానే’, ‘ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తీరు మారదా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హెచ్‌సీఏ సిబ్బంది కొందరు బ్లాక్ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టికెట్స్ విషయంలో ఎలాంటి అవకతవలకు అవకాశం ఇవ్వనని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెప్పినా.. సాధారణ అభిమానికి మాత్రం నిరాశే ఎదురవుతోంది. దీనిపై హెచ్‌సీఏ బాస్ ఏం సమాధానం చెబుతారో చూడాలి మరి.
కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై?:
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకుపోయింది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తూగా ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సేన తలపడబోతుంది. కాగా, ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత భారత జట్టులో కీలక మార్పు జరగబోతున్నాయని సమాచారం. రోహిత్ శర్మ వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి గుడ్ బై పలికి కేవలం ప్లేయర్ గా కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య చర్చలు కూడా కొనసాగినట్లు తెలుస్తుంది.