‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది:
గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అన్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు ప్రతీ ఇంటికి కరపత్రాలు కూడా పంచారని జగన్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు:
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక మేరకు ముందుగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం భావించారు. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంకు ఎంపిక చేశారు. దాంతో నాగబాబుకు రాజ్యసభ అంటూ వస్తున్న ప్రచారానికి జనసేన తెరదించింది. నాగబాబుకు సినిమాటొగ్రఫీ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ బృందం భేటీ:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి చర్చ కొనసాగింది. ఇక, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. ఆ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది తప్పితే.. ఆయా పార్టీలు అలాగే కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రతిబింబించవు అని అన్నారు. అలాగే, కాంగ్రెస్- సీపీఐ పార్టీల మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారంగా తమ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు దొమ్మాట సాంబయ్యకు ఇవ్వాలని కోరాం.. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీతో మాట్లాడి నిర్ణయం చెబుతాను అన్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు వెల్లడించారు.
కాంగ్రెస్ తుడిచి పెట్టాలని చూస్తుంది:
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్లపూర్ లోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్:
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. నిన్నామొన్నటి దాకా డిజిటల్ అరెస్ట్‌తో కోట్ల కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు. న్యూడ్ కాల్స్ పేరుతో సామాన్యుల్నే కాదు.. ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. వాళ్లను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాజాగా తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను నియోజకవర్గానికి అంతటికి పంపిస్తామని బెదిరింపులకు దిగారు. అందుకు ఎమ్మెల్యే ససేమిరా అనడంతో కేటుగాళ్లు అన్నంత పని చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను పంపించారు. ఆ విషయం కాస్త.. ఎమ్మెల్యేకు కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పడంతో ఖంగుతిన్నారు.
తమిళంపై ప్రేముంటే:
తమిళంపై కేంద్రానికి ప్రేముంటే.. తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయా రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో కమల్‌హాసన్ కూడా పాల్గొన్నారు. అంతకముందు స్టాలిన్.. హిందీపై కీలక పోస్ట్ చేశారు. ప్రధాని మోడీకి తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ చెబుతోందని.. అదే నిజమైతే చేతల్లో ఎందుకు చూపించడం లేదని స్టాలిన్ ప్రశ్నించారు. పార్లమెంటులో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కంటే.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుందన్నారు. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి.. మరిన్ని నిధులు కేటాయించాలని స్టాలిన్ కోరారు.
మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు:
మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. భూప్రకంపనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల పాకిస్థాన్, నేపాల్, ఉత్తర భారత్‌లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ప్రకంపలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు.
యువతిని చంపి యువకుడు ఆత్మహత్య:
కర్ణాటకలోని బెళగావిలో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందని యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐశ్వర్య మహేష్ లోహర్ (20)ని ప్రశాంత్ కుండేకర్ (29) అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. బెళగావి తాలూకాలోని యెల్లూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుండేకర్(29).. పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఐశ్వర్య అనే యువతిని ఏడాది కాలంగా ఇష్టపడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. అంతేకాకుండా.. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య తల్లిని కలిసి అడిగాడు. అయితే ముందు ఆర్థికంగా స్థిరపడు.. ఆ తర్వాత పెళ్లి విషయం ఆలోచిస్తామని సలహా ఇచ్చింది.
వన్డేలకు గుడ్ బై చెప్పిన ఆసీస్ కెప్టెన్:
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్లో భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్మిత్ తన నిర్ణయం ప్రకటించాడు. అయితే, 170 వన్డేల్లో 5,800 పరుగులు చేసిన స్మిత్.. 12 సెంచరీలు.. 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ అత్యధిక స్కోర్ 164 పరుగులు. అయితే, 2016లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 164 పరుగులు చేశారు. వన్డేల్లో 28 వికెట్లు తీసిన స్మిత్.. తన ఖాతాలో 90 క్యాచ్ లు ఉన్నాయి. స్మిత్ కెప్టెన్సీలో 64 మ్యాచ్ లు ఆడగా.. వాటిలో 32 విజయాలు, 28 ఓటములు.. మరో నాలుగు మ్యాచ్ లు ఫలితం తేలలేదు. కాగా, తాను ఇక నుంచి టీ20లు, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతానని స్మిత్ చెప్పుకొచ్చాడు.
పైరసీపై దిల్ రాజు కిలక కామెంట్స్:
సినిమా పరిశ్రమ దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది పైరసి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ రోజే పైరసీ రూపంలో నెట్టింట దర్శమనిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం థియేటర్ ప్రింట్స్ రూపంలో పైరసీలు వచ్చేవి. కానీ డిజిటల్ యుగంలో సినిమా స్థాయి మారిపోయింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో పైరసీ ముఠా కూడా టెక్నాలిజీకి అనుగుణంగా మరి మొదటి రోజే హై క్వాలిటీతో సినిమాలను పైరసీ చేస్తోంది. అత్తారింటికి దారేది నుండి ఇటీవల వచ్చిన తండేల్ వరకు తొలిరోజే హెచ్డి ప్రింట్ లు రిలీజ్ చేసింది పైరసీ గ్యాంగ్. ఈ పైరసీ వలన నిర్మాతలు, థియేటర్ యజమాన్యం భారీగా నష్టపోతుంది. అసలే ఓటీటీ సంస్థల వలన థియేటర్ రెవెన్యు అంతంత మాత్రం గా ఉంటె ఇప్పుడు పైరసీ వలన ఇంకాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పైరసీని నిలువరించేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేసారు. ఆయన మాట్లాడుతూ పైరసీ పై ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే మాట్లాడతారు. శుక్రవారం మాట్లాడితే సోమవారానికి మర్చిపోతున్నారు. దానిని అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. ఎఫ్ డి సి చైర్మన్ గా నేను లీడ్ చెస్తాను, నిర్మాతలందరు కలిసి రావాలి.డబ్బులు పోయేవి నిర్మాతలవే. అందరూ మెల్కోవాలి.. అండర్ ప్రొడక్షన్స్ లో ఉన్నవారు కూడా ముందుకు రావాలి.నేను నిర్మాతగా పంపిణీదారుడిగా వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటా’ అలా ప్రతీ ఒక్కరు చూసుకుంటూ జాగ్రత్త పడాలి. పైరసీపై అందరి కలిసి వస్తే ఏదైనా చేయగలం’ అని అన్నారు.
థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’ ట్రైలర్ రిలీజ్:
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించగా, రతన్ రిషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన అప్ డేట్ లు ఎంతో ఆకట్టుకోగా, తాజాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లిరిసిస్ట్ రాంబాబు గోశాల మాట్లాడుతూ ‘సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ‘ఆర్టిస్ట్’ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇప్పటికే రెండు సాంగ్స్ చూస్తూ, చూస్తూ, ఓ ప్రేమా రిలీజ్ అయ్యాయి. ఈ రెండూ నా ఫేవరేట్ సాంగ్స్. డైరెక్టర్ రతన్ రిషి మూవీని బాగా రూపొందించాడు. సంతోష్ కాల్వచెర్ల, క్రిషేక పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. నటి స్నేహ మాధురి శర్మ మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో ఒక కీ రోల్ లో నటించాను. నా ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా గుర్తుండిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రతన్ రిషి గారికి థాంక్స్’ అనగా..
వర్మకు సీఐడీ అధికారులు నోటీసులు:
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదయింది. రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు అందజేసారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు. రామ్ గోపాల్ వర్మ కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాలను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. తాజాగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీసాడని ఆర్జీవీపై కేసు నమోదు అవగా ఒంగోలులో విచారణను హాజరయ్యాడు ఆర్జీవీ. ఇప్పుడు సీఐడీ అధికారుల నోటీసుల నేపథ్యంలో విచారణకు మినహాయియింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ.