టీడీపీ-జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలు:
ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్‌ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్‌ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీపక్‌పై హత్య కేసు నమోదు చేస్తాం:
లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న నాగాంజలి.. ఈరోజు తుది శ్వాస విడిచింది. నాగాంజలి మృతిపై రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు స్పందించారు. ‘మెడికల్ విద్యార్థిని అంజలి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం. నాగాంజలి మృతి చెందిన కారణంగా నిందితుడు దీపక్‌పై హత్య కేసు నమోదు చేస్తాం. మృతురాలి సూసైడ్ నోటు, ఘటనకు సంబంధించి హాస్పటల్లో సీసీ కెమెరా విజువల్స్ సేకరించాం. నాగంజలి రూమ్‌మేట్స్‌ని కూడా విచారించాం. నాగంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తర్వాత నిందితుడు దీపక్‌ను అరెస్ట్ చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం దీపక్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరాం’ అని రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు చెప్పారు.
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ ప్రారంభం:
ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం అయింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరి లోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్:
మరికాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానున్నారు. హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. హెచ్‌సీయూ కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేదావులు, పర్యావరణ వేత్తలతో సంప్రదింపుల యోచనలో కమిటీ ఉంది. అపోహాలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా సర్కార్ సరికొత్త ఆలోచనలు చేయనుంది. సమస్య సద్దుమణిగాక కంచ గచ్చిబౌలి భూములలో కొత్త ప్రాజెక్టుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. కాగా.. ఇదే అంశంపై నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎస్‌తో సమావేశమయ్యారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు:
హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించింది. గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. కాగా.. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. గత నెల 27వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది.. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశం ఉంటుంది. ఈనెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం 25వ తేదీన ఉదయం 10 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితాల ప్రకటిస్తారు.
సుప్రీంకోర్టులో వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ:
సుప్రీంకోర్టులో గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియోలో పుట్ట మధు పేరు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి పరిశీలన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కోర్టు హాల్‌లో లాయర్‌ను చితకబాదిన మహిళలు:
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కోర్టులో సినిమా తరహాలో ఫైటింగ్ జరిగింది. కోర్టు హాల్‌లో ఇద్దరు మహిళలు.. మగ లాయర్‌ను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బస్తీ సివిల్ కోర్టు హాల్ నుంచి ఒక లాయర్ బయటకొస్తున్నాడు. ఇంతలో మహిళలు అడ్డగించి భౌతికదాడికి దిగారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏప్రిల్ 3న (గురువారం) ఈ ఘటన చోటుచేసుకుంది. లాయర్ కూడా అంతే ధీటుగా మహిళలపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న మిగతా లాయర్లంతా జోక్యం పుచ్చుకుని విడదీశారు. ఫోన్‌లో లాయర్ దుర్భాషలాడినట్లుగా ఒక మహిళ ఆరోపించింది. అతనితో మాట్లాడేందుకు వచ్చి గొడవకు దిగారు. అనంతరం కొట్లాటకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
పిటిషన్ వేస్తామన్న జైరాం రమేష్:
వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక బిల్లు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే చట్టంగా మారనుంది. బిల్లు చట్టంగా మారకముందే సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లును సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయబోతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో.. గురువరం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభలో 288 మంది సభ్యులు మద్దతుగా.. 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక రాజ్యసభలో 128 మంది సభ్యులు అనుకూలంగా.. 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఉభయ సభల్లో సులువుగానే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
మోడీ-యూనస్ భేటీ:
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్‌లు సమావేశమయ్యారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక.. నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి మోడీ-యూనస్ ముఖాముఖీగా కలవడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే మరోవైపు చైనాతో కూడా యూనస్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో యూనస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఈ మధ్య చైనాలో భారత్‌పై యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
‘గోల్డ్ కార్డు’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన ట్రంప్:
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేశారు. అంతేకాకుండా విదేశీయులకు జన్మతహ పౌరసత్వాన్ని రద్దు చేశారు. వీసాలకు బ్రేక్ వేశారు. కానీ ఆ మధ్య ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ కార్డు ఇస్తామని.. 5 మిలియన్ డాలర్లతో వస్తే పౌరసత్వాన్ని పొందుకోవచ్చని వెల్లడించారు. తాజాగా అందుకు సంబంధించిన గోల్డ్ కార్డు యొక్క ఫస్ట్ లుక్‌ను ట్రంప్ విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ 5 మిలియన్ డాలర్ల గోల్డ్ కార్డ్‌ను చూపించారు. కార్డుపై ట్రంప్ ఫొటో ఉంది. రెండు వారాల్లోపు కార్డ్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఆశ్చర్యపరుస్తున్న తమిళ సినిమాల ఓటీటీ డీల్స్:
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు కమల్ సినిమానే హయ్యెస్ట్ రేటుకు అమ్ముడై రికార్డ్స్ సృష్టించింది. ఫేడటవుతున్నారు అనుకున్న టైంలో జైలర్ కంబ్యాక్ హిట్టుతో తనేంటో ఫ్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ తర్వాత సినిమాలు దెబ్బేశాయి. కానీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న కూలీ మళ్లీ రజనీ ట్రాక్ ఎక్కిస్తుందన్న నమ్మకం తమిళ తంబీలకుంది. భారీ స్టార్ కాస్ట్ కూడా కూలీపై విపరీతమైన క్రేజ్,బజ్‌ను క్రియేట్ చేస్తోంది. దీన్నే భారీగా క్యాష్ చేసుకుంది సన్ పిక్చర్స్. సుమారు రూ. 110 నుండి 120 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్మిందని టాక్. జైలర్ 2 హక్కులు కూడా ప్రైమ్‌కే కట్టబెట్టనుంది నిర్మాణ సంస్థ. ఇవే కాదు ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్సులున్న సూర్య 45, కార్తీ సర్దార్ 2, వా వాతియార్, ధనుష్ ఇడ్లీ కడాయ్, రజనీ కాంత్ జైలర్ 2, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏస్, ట్రైన్, నయా సెన్సేషనల్ హీరోగా మారిన ప్రదీప్ రంగనాథ్ అప్ కమింగ్ లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ చిత్రాలు కూడా భారీ ధరలకు ఓటీటీ రైట్స్ పలికే అవకాశాలున్నాయి.
‘బుచ్చిబాబు’కు చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్:
రామ్ చరణ్ బర్త్ డే నాడు తన శ్రేయోభిలాషులకు ఆయన ప్రత్యేక కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా చరణ్ నటిస్తున్న పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు ‘హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను బహుమతిగా అందజేశారు. ప్రియమైన బుచ్చి బాబు ‘నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రాసిన లెటర్ ను జత చేస్తూ, శ్రీరాముల వారి పాదుకలను దర్శకుడు బుచ్చిబాబుకు పంపారు చరణ్ దంపతులు. ఆ సంతోషకరమైన సందర్భాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చరణ్ దంపతుల అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు. మీ ప్రేమ మరియు మద్దతుకు రుణపడి ఉన్నాను. హనుమంతుని ఆశీస్సులు మీతో ఉండాలని మరియు మీకు మరింత బలాన్ని మరియు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీ విలువలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు ఎల్లప్పుడూ స్థిరంగా మరియు వినయంగా ఉండాలని మాకు గుర్తు చేస్తాయి’ అని ఎక్స్ వేదికగా ఫొటోలను షేర్ చేసాడు బుచ్చి.
హిట్ 3 లీక్స్.. శైలేష్ ఎమోషనల్ పోస్ట్:
హిట్ 3 లో కోలీవుడ్ స్టార్ నటుడు నటిస్తున్నాడన్న సంగతి చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చింది యూనిట్. ఆడీయన్స్ కు సర్పైజ్ ఇద్దాం అని కార్తీ రోల్ ను సూపర్ గా డిజైన్ చేశారట. కానీ కొందరు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో డైరెక్టర్ కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ విషయమై ఎక్స్ లో ‘ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ తెలిస్తే దాన్ని ముందు వెనక ఆలోచించకుండా లీక్ చేసేందుకు ఒక్క సెకను కూడా ఆలోచించట్లేదు. ఆడియెన్స్ కు మంచి అనుభూతి ఇచ్చేందుకు తెర వెనుక ఎంతోమంది పగలూ రాత్రీ అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. స్పెషల్ మొమెంట్స్, సర్ప్రైజ్ లు ఇచ్చేందుకు ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. కానీ కొందరు వారి వారి స్వార్ధం కోసం అలాగే మరికొందరు జర్నలిస్టులు రీచ్ కోసం గోప్యంగా ఉంచాల్సిన విషయాలను లీక్ చేయడం బాధాకరం. ఏది లీక్ చేయకూడదు, ఏది లీక్ చేయాలనే బేసిక్ సెన్స్ ఉండాలి. ఇలా చేయడం తప్పో.. ఒప్పో మీకు మీరే ఆలోచించుకోకుండి. ఈ రకమైన రిపోర్టింగ్ కేవలం చిత్ర బృందం కష్టాన్ని దొంగిలించడం కాదు, ఇది ప్రేక్షకుల నుండి నేరుగా దొంగిలించడంతో సమానం’ అని పోస్ట్ చేసారు.