జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది:
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై జగన్ ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే అని, సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
అరకు లోయలో కిటకిటలాడుతున్న పర్యాటక ప్రాంతాలు:
ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు లోయను ఇష్టపడని వారుండరు. శీతాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు ఎంతో మంది అరకు వస్తుంటారు. అరకు లోయతో పాటు బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి మేఘాల కొండలు లాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వేలాది మంది పర్యటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.
సీఎం రేవంత్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీనీ పెద్దలు భేటీ ముగిసింది. సంధ్య థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు సాగిన సమావేశంలో బెనిఫిట్ షో, టికెట్ల పెంపుపై మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం బెనిఫిట్ షో, టికెట్ల పెంపు ఉండదని తేల్చిచెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యుల హాజరు కాగా.. రాఘవేంద్ర రావు, మురళీ మోహన్, దిల్ రాజు, శ్యాంప్రసాద్‌రెడ్డి, దగ్గుబాటి సురేష్‌బాబు, త్రివిక్రమ్, నాగార్జున సమావేశంలో మాట్లాడారు. బెనిఫిట్ షో, టికెట్ పెంపుపై సీఎంతో చర్చించిన ఫలితం లేకుండా పోయింది.
నో బెనిఫిట్ షో:
టాలీవుడ్ ఇండ్రస్ట్రీ పెద్దలకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పింది. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. ప్రభుత్వ తరుఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యుల హాజరయ్యారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండ్రస్టీ సభ్యులు మాట్లాడారు.
ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ అపోహే:
ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనేది అపోహే అని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ అనంతరం నిర్వహించిన సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ… ‘సినీ పరిశ్రమ అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే మా లక్ష్యం. ఇండస్ట్రీ అంశాలను భేటీలో చర్చిస్తాం. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చిన్న విషయాలు. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోంది. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు’ అని దిల్ రాజు అని తెలిపారు.
రామయ్య సన్నిధిలో కొత్త విధానం:
భద్రాచల రామాలయంలో అన్నదానం కోసం డిజిటల్ టోకెన్ల జారీ ప్రత్యేకతను సంతరించుకుంది. అంతకు ముందు క్యూలో వేచి ఉన్న భక్తులకు పరిమిత సంఖ్యలో అన్నదానం టిక్కెట్లు ఇచ్చేవారు. నవంబర్ 13 నుంచి అన్నదానం డిజిటల్ టోకెన్లు ఇస్తున్నారు. దీనిపై QR కోడ్ ఉంటుంది. భక్తులకు ఫొటో తీసిన టోకెన్ కూడా ఇస్తున్నారు. ఈ టోకెన్‌ను అన్నదానం సత్రంలో చూపించి భోజనం చేయవచ్చిన ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో రోజూ 1500 నుంచి 2 వేల మంది అన్నదానం చేస్తున్నారు.
ఐఆర్‌సీటీసీ సేవల్లో మళ్లీ అంతరాయం:
రైలు టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీగురువారం ఉదయం చాలా సేపు నిలిచిపోయింది. దీని కారణంగా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు టికెట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఇ-టికెట్ సేవ అందుబాటులో ఉండదని సందేశం చూపించింది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. అని సమాధానం వచ్చింది. ఎవరైనా తన పాత బుక్ చేసిన టిక్కెట్‌లను రద్దు చేయాలనుకుంటే, కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ ను సంప్రదించాలని ప్రదర్శించిన మెసేజ్‌లో పేర్కొన్నారు. 14646,08044647999 & 08035734999 లేదా etickets@irctc.co.in ఈమెయిల్ ప్రదర్శించారు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే సైట్ నిలిచిపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీని ట్యాగ్ చేస్తూ.. అనేక ప్రశ్నలు సంధించారు.
వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో ఆందోళన:
జమ్మూకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం నుంచి 72 గంటల పాటు పట్టణం మొత్తం బంద్ కొనసాగించాలని చెప్పుకొచ్చారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకోవడంతో పలు చోట్ల ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే, వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులు చేరుకోవడానికి 13 కిలో మీటర్ల పొడవునా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇక, పిల్లలకు, వృద్ధులకు ఈ ట్రెక్కింగ్ పెను సవాలుగా మారడంతో.. దాన్ని ఈజీగా చేసేందుకు రూ.250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించాలని పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయం తీసుకుంది.
కుంభమేళాలో మోడీ, యోగినే మా టార్గెట్:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2025 ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే మహా కుంభమేళాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ లోపు దాడులు చేస్తామని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వాంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. ఆ రోజుల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారు.. ఈ మహా కుంభమేళానే ఈ ఇద్దరు నాయకులకు చివరిదిగా మారుస్తామని అతడు వార్నింగ్ ఇచ్చాడు.
హీటెక్కిన బాక్సింగ్ డే టెస్ట్:
ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు హీటెక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్లేయర్ సామ్ కాన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, కాన్‌స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడంతో గొడవకు దారి తీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపు చేశారు. కానీ, కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ రియాక్ట్ అయ్యారు. కాన్‌స్టాస్ తన దారిన తాను వెళ్తుంటే.. విరాట్ మాత్రం తన డైరక్షన్‌ను మార్చుకుని.. సదరు ప్లేయర్ భుజాలు తాకడం మంచిది కాదని తెలిపారు. ఈ ఘటనలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలని మైకెల్ వాన్ పేర్కొన్నాడు.
ముగిసిన తొలి రోజు ఆట:
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68 పరుగులతో, పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పెరిగిన బంగారం ధరలు:
గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఈ రోజు (గురువారం) పసిడి ధరల్లో మళ్లీ మార్పు చోటుచేసుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.280 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,250గా.. 24 క్యారెట్ల ధర రూ.77,730గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా పసిడి మాదిరిగానే స్వల్పంగా పెరుగుతున్నాయి. నిన్న కేజీ వెండి ధర రూ. 99,000 ఉండగా.. నేడు రూ. 1000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.లక్షగా నమోదైంది. మరోవైపు బులియన్ మార్కెట్‌లో కూడా ఇదే ధర కొనసాగుతోంది.