ముందుగా ప్రజల దర్శనం:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు చేసి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు రాగా.. ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దర్శన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ప్రజల దర్శనం చేసుకుని, ఆ తరువాత దుర్గమ్మ దర్శనం చేసుకున్నా. ప్రజల ఆదాయం పెంచుతూ ఆరోగ్యంగా ఆనందంగా అమ్మవారు ఉంచాలని కోరుకున్నా. అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా బాబు:
తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి విన్యాసాలు చేసిన సంఘటన అందరిని షాక్ కు గుర్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్నెం జిల్లా పాలకొండ మండలం సింగిపురంలో ఓ తాగుబోతు హడలెత్తించాడు. మద్యం మత్తులో ఆ వ్యక్తి కరెంటు స్తంభం పైకి ఎక్కి హల్చల్ చేశాడు. అయితే మద్యం తాగిన వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పలువురు వెంటనే సంబంధిత పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఆపేశారు. ఆ తర్వాత మద్యం తాగిన వ్యక్తి ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ గల పైన పడుకున్నాడు. విద్యుత్ తీగలపైనే కొద్దిసేపు విన్యాసాలు చేశారు. గ్రామ ప్రజలు అందరూ కలిసి బలవంతంగా అతనిని కిందికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం తాగిన వ్యక్తి స్తంభం ఎక్కుతున్న సమయంలోనే అక్కడివారు త్వరగా స్పందించి సరైన సమయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాలతో మిగిలాడు. ఇక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అసలు అలా ఎందుకు విద్యుత్ స్తంభం ఎక్కాలనిపించింది అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.., మరికొందరేమో మద్యం తాగితే మరి ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ మండిపడుతున్నారు.
పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు;
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి పోలీసులు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్‌కి నోటీసులు అతికించారు.
ఎంత తాగావ్ రా నాయనా:
సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నియంత్రించడానికి పోలీసులు చెకింగులు చేస్తుంటారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం కేసులు పెట్టడం కామన్. ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు పెడతారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో 50 మి.గ్రాముల ఆల్కహల్ శాతం ఉంటే ఆ వ్యక్తి స్పృహాలో లేనట్లుగా గుర్తిస్తారు. బ్రీత్ అనలైజర్‌లో వందకు మించి ఆల్కహల్ శాతం నమోదైన సందర్భాలు లేకపోలేదు. కానీ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని పంజాగుట్ట సమీపంలో జరిగిన ఓ సంఘటన పోలీసులతో పాటు జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. పంజాగుట్ట సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ పెట్టి గాలి ఊదమన్నారు. ఆ వ్యక్తి గాలి ఊదగానే బ్రీత్ ఎనలైజర్ మిషన్ సైతం వణికిపోయింది. బ్రీత్ ఎనలైజర్‌లో ఏకంగా 550 రీడింగ్ నమోదుకావడంతో అంతా షాక్ అవుతున్నారు.
రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు:
హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో వివిధ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరుపగా, కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన తర్వాత నిబంధనలను పూర్తిగా అనుసరించడం లేదని అధికారులు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, కొన్ని రెస్టారెంట్లలో కంట్రోల్డ్ ఫుడ్ పద్ధతులు పాటించడం లేదని తెలిపారు. రేట్లతో సహా, ఈ రెస్టారెంట్లలో నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లు అధికారుల గుర్తించారు. ఇది ఆహార పదార్థాలకు హానికరం కలిగిస్తాయని, ముఖ్యంగా ఆరోగ్యపరమైన రుగ్మతలు కలుగ చేస్తాయని తెలిపారు. అలాగే కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు.
పురుషులు అలా చేసేందుకు నో పర్మీషన్:
కేరళలోని ఒక ప్రముఖ హిందూ సన్యాసి దేవాలయాలలో ప్రవేశించే పురాతన సంప్రదాయానికి స్వస్తి పలికారు. దేవాలయాలలో మగ భక్తుల పై వస్త్రాలను తొలగించే పద్ధతిని ఇక్కడ ముగించాలని చెప్పబడింది. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో ఈ ఆచారం కొనసాగుతోందని, భవిష్యత్తులో ఈ ఆచారం ఉండబోదని ప్రముఖ సాధు- సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురు స్థాపించిన ప్రముఖ శివగిరి మఠం అధిపతి స్వామి సచ్చిదానంద అన్నారు. స్వామి సచ్చిదానందకు ఒక తీర్థయాత్ర సదస్సులో ఒక సన్యాసి ఈ అభ్యాసానికి సంబంధించిన చెడు గురించి చెప్పారు. ఇది సామాజికంగా ప్రజల కష్టాలను పెంచే సమస్య అని అన్నారు. సన్యాసి దీనిని ముగించమని స్వామి సచ్చిదానందను అభ్యర్థించాడు. పై భాగం నుంచి బట్టలు తీసే విధానం చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైందని చెప్పారు. దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, పురుషులు ‘పూనూల్’ (బ్రాహ్మణులు ధరించే పవిత్రమైన దారం) ధరించారా లేదా అని చూడటానికి ఇది జరిగిందని అన్నారు.
మోహన్ భగవత్‌కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ:
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీపై ఆయన భగవత్‌కు ప్రశ్నలు సంధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్ నుంచి కాంగ్రెస్, బీజేపీ వరకు అన్ని పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. రాజధానిలో విజయాన్ని నమోదు చేసేందుకు అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వరుస దాడులు, ఎదురుదాడులు జరుగుతుండగా, ఓటరు జాబితా విషయంలో ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతూ కేజ్రీవాల్ ఇప్పుడు మోహన్ భగవత్‌కు లేఖ రాశారు.
భారతీయ సంతతి వైద్యుడి మృతి:
యూఏఈలో జరిగిన విమాన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్ మృతి చెందారు. డిసెంబర్ 26న యూఏఈలో తేలికపాటి విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇదే ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన 26 ఏళ్ల వైద్యుడు సులేమాన్ అల్ మజీద్ కూడా మరణించాడు. ఈ సంఘటన డిసెంబర్ 26న రస్ అల్ ఖైమా తీరంలో జరిగింది. ఈ ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన వైద్యుడితో పాటు 26 ఏళ్ల పైలట్, పాకిస్థాన్ మహిళ కూడా మరణించారు.
ఐసిస్ స్థావరాలపై ఫ్రాన్స్ దాడులు:
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గత వారం ఫ్రాన్స్ క్షిపణి దాడులు నిర్వహించిందని ఫ్రెంచ్ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను మంగళవారం తెలిపారు. సిరియాలో అమెరికా ఇదే విధమైన సైనిక దాడి తర్వాత ఫ్రెంచ్ వైమానిక దాడి చేసిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. సిరియాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదం పుంజుకోకుండా కట్టడి చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఫ్రెంచ్ వైమానిక దళాలు.. సిరియన్ భూభాగంలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడుల చేసినట్లు వెల్లడించారు. అమెరికా చేసిన దాడిని అనుసరించి.. ఈ దాడులు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు.
భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్:
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
షాకింగ్ డెసిషన్ తీసుకున్న ఆర్జీవీ:
నూతన సంవత్సరం కానుకగా ప్రపంచమంతా సంబరాలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితంలో సాధించబోయే వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే కోవలో ఒకప్పటి సెన్సషన్ డైరెక్టర్. ఇప్పటి వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ కానుకగా షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. అవి ఏంటో కూడా తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. మరి అవి ఏంటో ఓ సారి చదివేద్దాం రండి.
1 – నేను ఇక నుండి వివాదరహితుడిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను
2 – నేను ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలని భావిస్తున్నాను
3 – దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఉంటాను
4 – ఇక నుండి ప్రతి ఏడాది 10 సత్య లాంటి సినిమాలు తెస్తాను
5 – ఎవరిన నెగిటివ్ ట్వీట్స్ వేయను
6 – ఆడవారిని అసలు చూడను
7 – అలాగే వోడ్కా తాగడం మానేస్తాను