దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు:
టీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను.. తనకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నానని, మీ అన్నగా కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నెరవేరుస్తానని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. బతికే ఉందాం.. మరో నలుగురిని బతికిద్దాం అంటూ మంత్రి పిలుపునిచ్చారు.
తాడిపత్రి ఎవరి జాగీరు కాదు:
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి ఎవరి జాగీరు కాదని, వైసీపీ పార్టీ నాయకులంతా వస్తారన్నారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడను అని చెప్పారు. తాను అవినీతి చేసుంటే.. విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తాడిపత్రిలోనే కాదు అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం అని వెంకటరామిరెడ్డి చెప్పుకొచ్చారు.
చల్పాక ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు:
ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు ఉన్నాయని.. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. చనిపోయిన ఏడుగురి మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని.. అలాగే ఎన్‌కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.
గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత:
హైదరాబాద్ నగరం రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అని అనిపిస్తోంది. కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు.. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి హైదరాబాద్ మహానగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలో భారీగా గంజాయిని శంషాబాద్ డిటిఎఫ్( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్:
గండిపేట మండలం పీరంచెరువు పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. ఈ క్రమంలో నిఖేశ్ కూమార్‌కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిఖేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు మొత్తం 20 వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు రూ. 200 కోట్లకు పైగా విలువగల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నిఖేశ్ కుమార్‌కు కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొయినాబాద్‌లో మూడు ఫాంహౌజ్‌లు, మూడు విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా నిఖేష్ కుమార్ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిఖేష్ కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
పుదుచ్చేరిలో 47 సెంటీమీటర్ల వర్షం:
ఫెంగాల్ తుఫాను కారణంగా పుదుచ్చేరి తీవ్రంగా ప్రభావితమైంది. పుదుచ్చేరిలో పలుచోట్ల ఇళ్లలోకి వరదలు వచ్చాయి. ఫెంగాల్ తుఫాను పుదుచ్చేరిని సమీపించిన తర్వాత పుదుచ్చేరిలో 47 సెం.మీ వర్షపాతం నమోదైంది. విల్లుపురం జిల్లాలో 50 సెం.మీ, కడలూరులో 18 సెంటీమీటర్లు, మరకానాలో 23.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫెంగాల్ తుఫాను గత రాత్రి తీరం దాటినప్పటికీ, మారకానాలో ఇంకా బలమైన గాలులు వీస్తున్నాయి. గాలి వేగం తగ్గలేదని సమాచారం. పుదుచ్చేరిలో మరోసారి భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమై పుదుచ్చేరి రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. మామల్లపురం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ గాలి వేగం ఎక్కువగా ఉండడంతో విద్యుత్ సరఫరా కాలేదు.
ఆఖరి ఘట్టానికి చేరుకున్న బిగ్ బాస్:
బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చాడు. నిన్నటి ఎపిసోడ్ తో ఫైనల్ కంటెస్టెంట్ల జాబితా కొంతమేరకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్ టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్లలో ఆల్రెడీ టికెట్ టు ఫినాలె గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు.. సో టాప్ 5 కి ఈ సీజన్ లో అవినాష్ ఓ అడుగు ముందు నిలిచాడు. ఇక మిగిలింది నలుగురు మాత్రమే. ఆ నలుగురిలో ప్రస్తుతం టైటిల్ రేసులో దూసుకెళ్తున్న మరో ఇద్దరు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ టైటిల్ రేసులో ఉన్న నిఖిల్, గౌతమ్ ఇద్దరు కూడా లాస్ట్ వీక్ దాకా ఉంటారని దాదాపు ఫిక్స్ అయిపోయారు. అలా చూస్తే అవినాష్ తో పాటు నిఖిల్, గౌతమ్ ఈ ముగ్గురు టాప్ 5 లో కన్ఫర్మ్ అయినట్లే. అంటే ఐదుగురిలో ముగ్గురు కన్ ఫర్మ్ అయితే ఇంకా కావాల్సింది ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరు ఎవరు.. ఏ ఇద్దరికి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది అన్నది చూడాలి. సీజన్ 8 లో శనివారం ఎపిసోడ్ తో టాప్ 5 లో దాదాపు క్లారిటీ వచ్చేసింది.
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రూట్:
ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం జో రూట్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రూట్.. ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేయగా.. రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే 1630 రన్స్ బాదాడు.