లోకేష్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం:
పాఠశాలల హేతుబద్ధీకరణపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుధం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని, ‘నాడు-నేడు’ పేరుతో విద్యా వ్యవస్థను పతనావస్థకు చేర్చారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లరనడం సరికాదని, మంత్రి గారికి ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదని బొత్స పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది:
ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాసనసభలో సభ్యులు ఆహార కల్తీపై సంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మానవ వినియోగానికి సంబంధించిన ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ దిగుమతుల వంటివాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో ఆహార భద్రతా అధికారుల ఆధ్వర్యంలో అమలవుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఆహార భద్రతా కమీషనర్, జిల్లాలోని అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహక అధికారులు, అడ్జుడికేటింగ్ అధికారి, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్ట్ వంటి విభాగాలు ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయని వివరించారు. ఆహార భద్రతకు నియమించిన అధికారులు తినుబండారాలను, వారి సంబంధిత అధికార పరిధిలో ఉన్న తయారీదారులు, హోల్ సేలర్లు, రిటైలర్ల వంటి వారిని క్రమంతప్పకుండా తనిఖీ చేస్తున్నారని చెప్పారు. ఆహార నమూనాలను సేకరించి సమీప ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నారని, 2006 ఆహార భద్రతా ప్రమాణా చట్ట నిబంధనల ప్రకారం సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు.
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ పార్టీ, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ జాబితాలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ పార్టీలో ఉన్నారు. 2014లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. విడుదల రజనికి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్న మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
తెలంగాణ బడ్జెట్ 3.04 లక్షల కోట్లు:
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం 2,26,982, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదించారు. తలసరి ఆదాయం రూ. లక్ష 74 వేల 172. రూ. 1.8 తలసరి ఆదాయం పెరిగింది. కాగా గత బడ్జెట్.. 2.91 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నాం అని డిప్యూటీ సీఎం చెప్పారు.
పసి పిల్లలను అమ్ముతున్నారు జాగ్రత్త:
నేటి సమాజంలో డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈజీమని కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అడ్డదార్లు తొక్కుతున్నారు. దొంగతనాలు, దోపిడీలే కాదు పసిపిల్లలను అపహరించి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.10 మంది పసికందులను రక్షించారు. ముఠా సభ్యులు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పిల్లల్ని తెచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఒక్కొక్క పసికందును ఐదు నుంచి పది లక్షలకు అమ్ముతున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికే పిల్లల అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన వందనను అరెస్టు చేశారు. గుజరాత్ కేంద్రంగా పిల్లల విక్రయాలకు పాల్పడుతున్న వందన. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో బ్రోకర్స్ ను పెట్టుకుని పిల్లల విక్రయాలకు పాల్పడుతోంది.
రేపు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం:
హైదరాబాద్ లో రేపు(మార్చి 20) మధ్యాహ్నం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. జీహెచ్ఎంసీ మేయర్, కమీషనర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. కొత్తగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి స్టాండింగ్ కమిటీలో ఎనిమిది మంది MIM, ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో ప్రాతినిధ్యం లేని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మొత్తం 16 అంశాలపై చర్చించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నది స్టాండింగ్ కమిటీ. అల్వాల్ లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ NOC ఇవ్వనున్నది. నల్లగండ్ల చెరువులోకి వచ్చే మురుగునీటినీ మళ్లించడానికి 3 కోట్ల 35 లక్షల కేటాయింపుకు కమిటీ ఆమోదం తెలపనున్నది.
పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్:
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడ జేపీ నడ్డాతో బిల్‌గేట్స్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిల్‌గేట్స్ సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ సహకారం గురించి చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మూడేళ్లలో బిల్‌గేట్స్‌కి ఇది మూడో పర్యటన కావడం విశేషం.
ఢిల్లీ వీధుల్లో పిల్లలతో క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని:
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రధాని మోడీ.. పలువురు కేంద్ర పెద్దలతో సమావేశం అయ్యారు. ఇక ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సంతకాలు జరిగాయి. బిజిబిజీగా గడిపిన క్రిస్టోఫర్ లక్సాన్.. ఏమనుకున్నారో ఏమో తెలియదు గానీ.. కాసేపు సామాన్యుడిలా మారిపోయారు. ఆట విడుపు కోసం పిల్లాడిలా మారిపోయారు. అంతే ఢిల్లీ వీధుల్లోకి వెళ్లి.. చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. కొద్దిసేపు బ్యాటింగ్ చేసిన తర్వాత.. బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఈ ఆటలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను లక్సాన్ తన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, న్యూజిలాండ్‌ను దగ్గర చేయడంలో క్రికెట్‌ను మించింది మరొకటి లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టెస్లా షోరూమ్‌కి నిప్పు:
టెస్లా కార్ల సంస్థకు అమెరికాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూమ్‌కి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో పలు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే ఒక కారుపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ స్పందిస్తూ.. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
జస్ట్ ఇది శాంపిల్ మాత్రమేనన్న నెతన్యాహు:
గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. ఈ ఘటనలో హమాస్‌కు చెందిన కీలక నేతలంతా నేలకొరిగినట్లు సమాచారం అందుతోంది. దాదాపు ఇప్పటి వరకు 413 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆస్పత్రులు రక్తమోడాయి.
ఇదీ మహేశ్ రేంజ్:
మహేశ్ బాబు, రాజమౌళి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. దీంతో లీకులతోనే సరిపెట్టుకుంటున్నారు మహేశ్ ఫ్యాన్స్. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ ఒడిశా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతుండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయింది. దీంతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. సెట్‌లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరి రోజు రాజమౌళి అక్కడున్న లోకల్ వాళ్లతో కలిసి వాలీబాల్ కూడా ఆడారు. ఇక ఒరిస్సా షెడ్యూల్ ముగిసిన సందర్భంగా కోరాపుట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెప్పాడు రాజమౌళి. అలాగే ఓ ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాజమౌళి SSMB29 అని ట్యాగ్ పెట్టి సంతకం చేశారు. దీంతో మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ వర్కింగ్ టైటిల్ SSMB29 ఫిక్స్ అయిందని చెప్పాలి.
సేతుపతి సినిమా నుండి పూరి కనెక్ట్స్ ఔట్:
ఒకప్పుడు పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చాడు పూరి జగన్నాథ్. కానీ ఇప్పుడు ఒక హిట్ అందించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు అనుకునేలోగా ‘లైగర్’ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. ఇక బౌన్స్ బ్యాక్ అవాలని తాను డైరెక్ట్ చేసిన హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించా డు పూరి. కానీ ఈ సినిమతో పూరి జగన్నాథ్ ప్రభావం పూర్తిగా కోల్పోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పూరితో సినిమా చేసేందుకు హీరోలెవరు ముందుకు రాకపోవడంతో తమిళ హీరోను లైన్ లో పెట్టాడు. మహారాజ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు బెగ్గర్ అనే వర్కింగ్ టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అయితే గత కొన్నేళ్లుగా పూరి సినిమాలు అన్ని ఆయన సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్ పైనే ఛార్మి నిర్మాతగా నిర్మించే వారు. అయితే ఇప్పుడు పూరి డైరెక్ట్ చేయబోతున్న ‘బెగ్గర్’ సినిమాను పూరి కనెక్ట్స్ పై చేయట్లేదని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతో కెవిఎన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ నటిస్తున్న జననయగన్ ను కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది.
ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు:
ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ సంగ్రామం ప్రారంభంకాబోతోంది. తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యన జరుగనున్నది. ఇదిలా ఉంటే.. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. మ్యాచ్ నిర్వహనకు బెంగాల్ పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో షెడ్యూల్ లో మార్పు చేయనున్నారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి కావడంతో… బెంగాల్‌లో సుమారు 20 వేల చోట్ల భారీగా ర్యాలీలు తీసేందుకు బీజేపీ నేత సువేందు అధికారి ప్లాన్ చేస్తున్నారు. దీంతో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద సెక్యూరిటీ కల్పించలేం అని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేసుకోవాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు పోలీసులు లేఖ రాశారు.