21 నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం:
విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణ కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు విరమణలు జరగనున్నాయి. దీక్షలు విరమణల ఏర్పాట్లపై నేడు ఇంద్రాకిలాద్రిపై సమీక్ష జరగగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
వాహనదారులపై టోల్ భారం:
విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే.. అన్నిసార్లూ టోల్ మోత మోగుతోంది. కాజ వద్ద మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్‌ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో.. గత అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది. గత సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే రూ.160, తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా.. టోల్ వసూళ్లు ఉండేవి కావు. అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం.. ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం చొప్పున వసూలు చేస్తున్నారు. దాంతో పని నిమ్మిత్తం ప్రయాణించే వారిపై పెను భారం పడుతోంది.
భూ-భారతి బిల్లు ప్రధానాంశాలు:
నేడు తెలంగాణ శాసనమండలిలో భూ-భారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని తెలిపారు. ధరణిని తొలగించి కొత్తగా ఈ భూ-భారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఇకపోతే, భూ-భారతి బిల్లులోని ప్రధానాంశాలు, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. ఆరు మాడ్యూళ్లు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదించారు. 11 కాలమ్‌లు : గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేసారు. డిస్‌ప్లే : గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేసారు.
గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై స్పందించిన మంత్రి సీతక్క:
తెలంగాణ శాసన మండలిలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహార సమస్యలపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, హాస్టల్ సిబ్బందితో పాటు సరఫరాదారులపై కూడా నిఘాను పెంచుతామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 70 సంఘటనలు నమోదయ్యాయని, అందులో 5024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ పరిస్థితి విషమించినప్పుడే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని నిమ్స్‌లో శైలజను మంత్రులు, సీఎంవో సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారని మంత్రి వివరించారు. గత పాలనలో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని, నిరుద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదని సీతక్క ఆరోపించారు. గడిచిన ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచినట్టు, 16 ఏళ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను పెంచి గురుకులాల్లో విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆమె పేర్కొన్నారు.
కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం:
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించకుండా, చట్ట ప్రకారం జరిగే వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో.. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అవలంభించే ఇలాంటి చర్యలతో దేశంలో తయారీ రంగం రోజురోజుకు మరింత బలహీనపడుతోంది, కరెన్సీ విలువ క్రమంగా పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రికార్డు స్థాయిలో గరిష్ఠ వాణిజ్య లోటు, అధిక వడ్డీ రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. వస్తువుల వినియోగం తగ్గి ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి చూస్తున్నామని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
భారత్కు బైడెన్ సర్కార్ గుడ్న్యూస్:
అమెరికాలో ఉద్యోగాలు చేయాలని చూస్తు్న్న వారికి జో బైడెన్ శుభవార్త చెప్పారు. మరింత తేలిగ్గా విదేశీయులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు అవకాశం కల్పిస్తూ మార్పులు చేసింది. దీంతో పాటు ఈజీగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా ఛేంజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇది లక్షల మంది భారతీయ యువతకు చాలా ప్రయోజనం కల్పిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎఫ్-1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లైంది. అయితే, హెచ్-1బీ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి రానుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సహాయంతో నియమించుకుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల యువత ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీంతో సంస్థలు తమ అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకుని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకుని ఛాన్స్ ఉంది.
రష్యా కొత్త చట్టం:
పలు సంస్థలపై రష్యా ఉగ్రవాద ముద్ర వేసింది. ఈ క్రమంలో వాటికి ఆ ముద్ర నుంచి రిలీఫ్ కల్పించేందుకు మాస్కో రెడీ అవుతుంది. అందులో భాగంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉగ్ర సంస్థలకు ఆ ముద్రను క్యాన్సిల్ చేసే హక్కు కోర్టులకు అప్పగించింది. ఈ చట్టాన్ని పార్లమెంటు దిగవ సభ స్టేట్ డూమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతుంది. కాగా, ఈ చట్టంతో ఉగ్ర కార్యకలాపాలకు ఆయా సంస్థలు దూరంగా ఉన్నట్లు న్యాయస్థానం గుర్తిస్తే జాబితా నుంచి వాటిని తొలగించే ఛాన్స్ ఉంది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటుదారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు రష్యాకు లైన్ క్లియర్ అవుతుంది. మొట్టమొదటిగా 2003లో ఆఫ్గాన్ తాలిబన్లను రష్యా ఉగ్ర సంస్థలుగా ప్రకటించింది. ఆ తర్వాత సిరియా తిరుగుబాటుదారులను అందులో అటాచ్ చేసింది. అయితే, సరిహద్దు దేశమైన సిరియాలో రెబల్స్ తిరుగుబాటుతో బషర్ అల్-అసద్ పాలనకు ముగింపు పలికింది.
14 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన బ్లాక్ బస్టర్ జోడి:
అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు. మళ్లీ 14 ఏళ్లకు ఈ బ్లాక్ బస్టర్ జోడీ రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యింది. మరోసారి హారర్ కామెడీతో వస్తోంది ఈ హిట్ కాంబో. ప్లాపుల్లో ఉన్న ప్రియదర్శన్‌తో కలిసి భూత్ బంగ్లా చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్. భూత్ బంగ్లా ప్రజెంట్ సెట్స్ పైకి వెళ్లగా అప్పుడే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. రీసెంట్లీ రిలీజ్ డేట్ విషయంలో ఇతర హీరోలు, సినిమాలతో క్లాషెస్ వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా అఫీషియల్ ఎనౌన్స్ చేశారు. 2026 ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న’సంతోష్’:
ఆస్కార్ 2025 షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈ లిస్ట్ అనేక సూపర్ హిట్ సినిమాలు చోటు సంపాదించుకోగా మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో చోటు కోల్పోయి షాక్ ఇచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఓ చిన్న సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సాధించింది. అదే సంతోష్. షహనా గోస్వామి నటించిన ఈ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌లో అధికారకం ఎంట్రీ ఇచింది. షహనా గో స్వామి బాలీవుడ్ చిత్రాలతో పాటు అనేక హాలీవుడ్ సినిమాలో నటించింది. గతేడాది షబానా లీడ్ రోల్ లో నటించిన హిందీ చిత్రం సంతోష్ . ఈ సినిమా యూకే నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో స్థానం సాధించింది. ఈ చిత్రానికి సంధ్య సూరి దర్శకత్వం వహించారు.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్:
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2011లో తన టెస్టు క్రికెట్ ప్రవేశంతో మొదలు అశ్విన్ భారత్ కు అనేక విజయాలు సాధించి, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ చేసిన ప్రయాణం ఎన్నో గొప్ప విజయాలతో నిండింది. టెస్టులలో అతను భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడమే కాక.. వన్డే, టీ20ల్లోనూ తన సత్తా చాటాడు. అశ్విన్ తన కెరీర్‌లో 700+ వికెట్లను తీసుకున్న స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు. అతని స్పిన్నింగ్ ప్రతిభ, సరైన సమయాల్లో దాడి చేయగల సామర్థ్యం అతనిని అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్‌గా నిలిపింది.