దేవాలయాలకు భద్రత లేదు:
24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం అని, అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్‌తో కూలగొట్టిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్‌తో కాశినాయన క్షేత్రంను కూల్చారన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగిందన్నారు. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి నారా లోకేష్ తానే కట్టిస్తా అన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు భద్రత లేదు, సనాతన ధర్మానికి రక్షణ లేదు అని భూమన ఫైర్ అయ్యారు.
భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు:
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓలో ఫిర్యాదు నమోదైంది. అధికార హోదా లేకున్నా.. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్థానంలో సమీక్ష సమావేశానికి ఆళ్లగడ్డ టీడీపీ నేత విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్.. ఎమ్మెల్యేలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరిత.. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వేదికపై కూర్చుని భూమా విఖ్యాత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఏ అధికార హోదా లేకున్నా సమీక్ష సమావేశానికి విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారని సీఎంఓకు మంత్రులు ఫిర్యాదు చేశారు.
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు:
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు అయింది. హర్ష సాయి పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ‘బెట్టింగ్ యాప్‌లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్లు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా..? సమాజహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా..! ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను ఆన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి’ అని సజ్జనార్ పేర్కొన్నారు.
తాండూర్లో చిరుత పులి కూనలు ప్రత్యక్షం:
వికారాబాద్ జిల్లా తాండూర్లో చిరుత పులి కూనలు ప్రత్యక్షమయ్యాయి.. గత నెల 28న కోటబాస్ పల్లి పరిసరాల్లో చిరుత పులి కూనలను గ్రామస్తులు గుర్తించారు. అయితే.. ఓ కూన పిల్లను గుర్తించి అటవీ శాఖ వైద్యులు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం.. పులి కూన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా మరో పులి కూనను డ్రైవర్ జావిద్ గుర్తించారు. మల్కాపూర్ పరిసరాల్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర చెట్లలో పులి పిల్ల తిరుగుతున్నట్లు జావిద్ గుర్తించాడు. కాగా.. వెంటనే అతను అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. అటవీ శాఖ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని పులికూన కోసం గాలిస్తున్నారు. రెండు పులి కూనలు ఈ ప్రాంతంలోనే కనబడడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల తల్లి కూడా ఇక్కడే సంచరిస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. అటవీశాఖ అధికారులు పొలాల దగ్గరకు వెళ్లే వారు ఒంటరిగా వెళ్లొద్దని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్:
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మిక అనారోగ్య సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించి, అన్ని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సమాచారం ప్రకారం రెహమాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత తాజాగా ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇందుకు సంబంధించి అపోలో ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల విడుదల చేసింది. ఈ హెల్త్ బులెటిన్ లో డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. రెహమాన్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరంగా పూర్తి స్థాయిలో కోలుకున్నారని తెలిపారు. రెహమాన్ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేశారు.
చిన్నారి పాటకు మంత్రముగ్ధుడైన కేంద్ర హోంమంత్రి:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఈశాన్య భారత పర్యటన సందర్భంగా శనివారం (మార్చి 15) మిజోరాంలో ఓ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించారు. మిజోరాంకు చెందిన ఏడేళ్ల గాయనీ ఎస్తేర్ లాలదుహావమీ హనామ్తే పాటకు కేంద్రమంత్రి అమిత్ షా మంత్రముగ్ధుడయ్యాడు. దింతో ఆ చిన్నారికి గిటార్ ను బహుకరించారు. ఈ సందర్భంగా, అమిత్ షా తన అధికారిక X (Twitter) ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. భారతదేశం పట్ల ప్రేమ మనందరినీ కలిపే బంధంగా మారుతుంది. మిజోరాం వండర్ కిడ్ ఎస్తేర్ లాలదుహామీ హనామ్తే వందేమాతరం పాటను ఆలపించడం నన్ను చాలా భావోద్వేగానికి గురి చేసిందని పేర్కొన్నారు. ఏడేళ్ల వయసు ఉన్న చిన్నారి ఎస్తేర్ దేశభక్తితో నిండిన పాటను ఆలపించడం నిజంగా ఓ అద్భుత అనుభూతని అన్నారు. ఆమె గానం చేసిన ‘మా తుఝే సలామ్’ పాట ఐదవరకు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశభక్తిని వ్యక్తపరిచే ఆమె గానం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఈ ప్రతిభకు గుర్తింపుగా మిజోరాం ప్రభుత్వం చిన్నారిని అనేక అవార్డులతో సత్కరించింది.
సునీతా రాకకు కౌంట్‌డౌన్:
ప్రపంచ మంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడమే. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనున్నది. సునీతా రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడానికి ప్రయోగించిన క్రూ డ్రాగన్ (స్పేస్‌క్రాఫ్ట్) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించింది. డాకింగ్ ప్రక్రియ కూడా ఈరోజు (మార్చి 16) పూర్తయింది. అన్నీ అనుకూలిస్తే ఇద్దరూ మార్చి 19న భూమికి తిరిగి చేరుకుంటారని సమాచారం. సమాచారం ప్రకారం.. అంతరిక్ష నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో దిగే ఛాన్స్ ఉందంటున్నారు.
అమెరికాలో తుఫాను విధ్వంసం:
అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర తుఫాను విధ్వంసం సృష్టించింది. భీకరమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లుగా సమాచారం. టోర్నడోలు అమెరికాలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మూడు కౌంటీలలో ఆరుగురు మరణించారని, ముగ్గురు తప్పిపోయారని మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది గాయపడ్డారని వెల్లడించారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.
కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం:
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రిమియర్స్ తో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శనివారం ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. కాగా కోర్ట్ సూపర్ హిట్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది కోర్ట్. ప్రీమియర్స్ రూపంలో దాదాపు రెండు కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మొత్తంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇక శనివారం వీకెండ్ కావండంతో అన్ని సెంటర్స్ లో ఫుల్స్ తో భారీ కలెక్షన్స్ రాబట్టింది కోర్ట్. వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ ను యాడ్ చేసారు మేకర్స్. ఇక రెండు రోజులుకు గాను వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది. అటు ఓవర్సీస్ లోను కోర్ట్ అద్బుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ప్రీమియర్స్ తో పాటు రెండు రోజుల మొత్తం కలెక్షన్స్ చుస్తే 500K డాలర్స్ రాబట్టింది అధికారకంగా ప్రకటించారు మేకర్స్. పోటీలో ఇతర సినిమాలు లేకపోవడం కోర్ట్ లాంగ్ రన్ లో భారీ లాభాలు తెచ్చిపెట్టె అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది.
పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ నుండి స్టార్ హీరోయిన్ ఔట్:
ప్రజంట్ సౌత్ ఇండస్ట్రీలో యంగ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది శ్రీ లీల. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్నారు. ఇలా ప్రస్తుతం వరుస టాలీవుడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంది. ఇక త్వరలోనే శ్రీ లీల నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న శ్రీ లీల గురించి, ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతుంది. ఒకేసారి ఏకంగా పదేసి సినిమాలు ఓకే చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు డేట్స్ కుదరక ఇబ్బందులు పడుతుంది. ఈ కారణంగా ఓ బడ ప్రాజెక్ట్‌ని కూడా వదులుకోబోతుందట శ్రీ లీల. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న అవైటెడ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఒకటీ రెండు షెడ్యూల్స్ కూడా మేకర్స్ పూర్తి చేశారు. అంతేకాదు వీటిలో శ్రీలీల కూడా పాల్గొంది. కానీ ఇపుడు ఈ బిగ్ ప్రాజెక్ట్‌ని వదులుకుంటే బెటర్ అని శ్రీలీల ఆలోచిస్తున్నట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
తీరుమారని పాకిస్తాన్:
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఆరంభం ఎదురైంది. క్రైస్ట్‌చర్చ్ లోని హెగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో పాకిస్తాన్ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి న్యూజిలాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. పాకిస్తాన్ ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. ఆ సమయంలో కేవలం ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీనితో పాకిస్తాన్ జట్టు కేవలం 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ తరఫున ఖుష్దిల్ షా 32 పరుగులు చేయగా, జహానదాద్ ఖాన్ 17 పరుగులతో పాకిస్థాన్ కాస్త గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో జాకబ్ డఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 4 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. మరోవైపు కైల్ జామిసన్ కూడా, 4 ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈష్ సోది 2 వికెట్లు, జాకరీ ఫౌల్కెస్ 1 వికెట్ సాధించారు.
ఇది కదా ఐపీఎల్ క్రేజ్:
ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని, వినోదాన్ని పంచే గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఈ సారి జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ ను మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) కలిసి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానుల కోసం ఈ ఉచిత మెట్రో రైలు, బస్సు సేవలను అందిస్తున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు టిక్కెట్ కలిగిన వారు మెట్రో రైలు సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, క్రికెట్ టిక్కెట్ కలిగిన ప్రేక్షకులు తమ సమీప మెట్రో స్టేషన్ నుండి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు.